- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UGC: వర్సిటీల్లో రిక్రూట్‌మెంట్స్‌కు న్యూ గైడ్‌లైన్స్
యూనివర్సిటీలు, డిగ్రీ, పీజీ కాలేజీల్లో నియామకాలు, ప్రమోషన్స్ కోసం యూజీసీ ఇటీవల ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: యూనివర్సిటీలు, డిగ్రీ, పీజీ కాలేజీల్లో నియామకాలు, ప్రమోషన్స్ కోసం యూజీసీ ఇటీవల ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిపై ఫిబ్రవరి ఐదో తేదీ వరకు అభిప్రాయాలను సేకరిస్తున్నది. ఆ తర్వాత పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ ప్రతిపాదనలు జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020 లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని చెబుతున్నది. అయితే ఈ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ పై ఫ్యాకల్టీలు, స్టూడెంట్స్ నుంచి తీవ్ర వ్యతిరేత వస్తున్నది. భవిష్యత్తును విద్యను కార్పొరేటీకరించేందుకు ఈ నూతన డ్రాఫ్ట్ అంశాలు దారి తీస్తాయని పలువురు విద్యావేత్తలు, రీసెర్చ్ స్కాలర్లు, ప్రొఫెసర్లు విమర్శిస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది డ్రాఫ్ మాత్రమేనని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్, యూజీసీ చైర్మన్ ఎం.జగదీష్ కుమార్ చెబుతున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, ఆ తర్వాతే పూర్తిస్థాయి మార్గదర్శకాలు రూపొందుతాయని పేర్కొంటున్నారు.
నియామక ప్రక్రియలో అనేక మార్పులు
యూజీసీ-2018 మార్గదర్శకాలతో పోల్చుకుంటే ప్రస్తుత డ్రాఫ్ట్ నిబంధనలు కఠినంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అధ్యాపకుల నియామకాల ప్రక్రియలో కొత్త డ్రాఫ్ట్ లో కీలక మార్పులు చేశారు. ప్రమోషన్, విద్యా ప్రమాణాలు, అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీని పెంచారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్ డీ డిగ్రీలు ఒకే సబ్జెక్టులో కలిగి ఉండాలి. అయితే 2025 డ్రాఫ్ట్ లో అకడమిక్ స్పెషలైజేషన్ ఆధారంగా సబ్జెక్టులను బోధించేందుకు అవకాశాలను కల్పించారు. నెట్, సెట్ అర్హత కూడా అభ్యర్థులకు గతంలో ఉన్న ఏదైనా సబ్జెక్టుతో సంబంధం లేకుండా, స్పెషలైజేషన్ సబ్జెక్టును విద్యార్థులకు బోధించేందుకు మార్గాన్ని సుగమం చేశారు. కళలు, క్రీడలు, సంప్రదాయ విభాగాల్లో నిపుణులను మాత్రమే నియమించేలా గైడ్ లైన్స్ మార్చారు. ప్రమోషన్స్ నిబంధనల్లో కూడా మార్పులను చేశారు. గతంలో అధ్యాపకుల ప్రమోషన్ కు బోధనా ప్రమాణాలు, విద్యాసంబంధ అంశాలను కీలకంగా పరిగణించేవారు. కానీ, 2025 డ్రాఫ్టులో ఎఫెక్టివ్, రీసెర్చ్ అవుట్ పుట్, అకడమిక్ కంట్రిబ్యూషన్ తోపాటు అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర అభ్యాసనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
అకడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ (ఏపీఐ) సిస్టమ్
ప్రస్తుత ముసాయిదాలో ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకుల బోధనా సామర్థ్యాలను అంచనా వేసేందుకు కొత్తగా అకడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ సిస్టమ్ ను తీసుకొస్తున్నారు. మార్కులతో అంచనా వేసే పద్ధతిని తొలగించి, వినూత్న బోధన, పరిశోధనలకు నిధుల సహకారం, డిజిటల్ కంటెంట్ తీసుకొచ్చేందుకు సమగ్ర ముల్యాంకన వ్యవస్థను తీసుకురావాలని భావిస్తున్నారు.
వీసీల ఎంపిక ప్రక్రియలోనూ మార్పులు
యూనివర్సిటీ వైస్ చాన్సలర్ల ఎంపికలోనూ కొత్త డ్రాఫ్ట్ లో కీలక మార్పులను చేశారు. పరిశ్రమలు, కంపెనీల సీఈఓలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలసీ మేకింగ్, ఇతర రంగాల నుంచి ఉన్న విశిష్ట వ్యక్తల ప్రతిభా, సామర్థ్యాలను వినియోగించుకునేలా డ్రాఫ్ట్ రూపొందించారు. అయితే వారు కచ్చితంగా విద్యారంగానికి సంబంధించిన అర్హతలను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీని ద్వారా వారికున్న అనుభవం ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. అయితే, వీసీల ఎంపిక నిబంధనలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర రంగాల వారిని వీసీలుగా నియమిస్తే.. అకడమిక్ ఆధారంగా ఉన్న సీనియర్ అధ్యాపకులకు ప్రమోషన్లు ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వీసీలుగా ఇతర రంగాల వారిని ఎంపిక చేస్తే విద్యాప్రమాణాలు నీరుగారిపోయే ప్రమాదముందని పేర్కొంటున్నారు.
కొత్త మార్గదర్శకాలపై విమర్శలు
కేంద్ర ప్రభుత్వం విద్య కేంద్రీకరణ, కార్పొరేటీకరణ, వ్యాపారీకరణను ప్రోత్సహించే నిర్ణయాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు. డ్రాఫ్ట్ లో పేర్కొన్న ఎన్నో అంశాలపై పూర్తి స్పష్టత ఇవ్వలేదని పేర్కొంటున్నారు. ఇప్పటికే విద్యారంగం కార్పొరేటీకరణ అయిందని, ఉన్నత విద్యలోనూ ఈ కార్పొరేటీకరణ ఎక్కువైతే దేశంలో తీవ్ర అసమానతలు పెరిగే ప్రమాదముందని చెబుతున్నారు. తద్వారా భవిష్యత్తులో పేదలు ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు. నాణ్యమైన విద్య కూడా అందే అవకాశాలు ఉండవన్నారు. కాగా, 2002 నుంచి చాలా యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ కాలేదు. యూజీసీ నిధుల కొరతతో సతమతమవుతున్నది. సామాజిక న్యాయం, రిజర్వేషన్లు వంటి ప్రామాణిక అంశాలను యూజీసీ విస్మరించిందనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. మరోవైపు రాష్ట్రాలు తమ ప్రత్యేక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికాంశాలకు అనుగుణంగా విద్యావిధానాలు రూపొందించుకోవాలనే ప్రాముఖ్యతను రాష్ట్రాలు నొక్కిచెబుతున్నాయి. రాష్ట్రాలు విద్యలో తమ హక్కులు తిరిగిపొందేందుకు, విద్యలో స్వయం నిర్ణయాధికారం, స్వతంత్రతను కోరుకుంటున్నాయి. భారతదేశంలో విశ్వవిద్యాలయాలు సైద్ధాంతిక నియంత్రణ, కార్పొరేట్ శక్తులకు లాభదాయక సాధనాలుగా మార్చేందుకు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






