తుది దశకు కొత్త బిల్డింగ్ రూల్స్-2026..! HMDA కమిషనర్‌కు అందిన UDBC రిపోర్ట్

by Kema Shiva Kumar |

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యూనిఫైడ్ డెవలప్‌మెంట్ బిల్డింగ్ కోడ్ (యూడీబీసీ) రూపకల్పన తుది దశకు చేరుకుంది.

తుది దశకు కొత్త బిల్డింగ్ రూల్స్-2026..! HMDA కమిషనర్‌కు అందిన UDBC రిపోర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యూనిఫైడ్ డెవలప్‌మెంట్ బిల్డింగ్ కోడ్ (యూడీబీసీ) రూపకల్పన తుది దశకు చేరుకుంది. పట్టణాభివృద్ధి కోసం నియంత్రణ వ్యవస్థను ఏకీకృతం చేయడం, బలోపేతం చేయడం కోసం యూనిఫైడ్ బిల్డింగ్ కోడ్‌ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. బిల్డింగ్ కోడ్ రూపకల్పన చేసే బాధ్యతలను ఎర్న్‌స్ట్, యంగ్ (ఈవై) సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ తెలంగాణలో అమలులో ఉన్న విధానాలను ఇతర జాతీయ, అంతర్జాతీయ కేస్ స్టడీలతోపాటు బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తీసుకుని ఉత్తమ విధానాలతో యూనిఫైడ్ కోడ్ ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదా రిపోర్టును కమిటీ చైర్మన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు అందజేశారు

స్టేక్ హోల్డర్ల సహకారంతో..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), ఈవై సంయుక్తంగా యూనిఫైడ్ డెవలప్‌మెంట్ బిల్డింగ్ కోడ్ రూపొందించారు. రూల్స్ తయారు చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రయివేటు సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ ప్లానింగ్ నిపుణులను భాగస్వాములను చేశారు. దీంతోపాటు రెండు సార్లు ‘స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్ వర్క్‌షాప్’ను నిర్వహించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల సుస్థిరమైన, సమగ్ర అభివృద్ధి కోసమే విభిన్న శాఖలు, అర్బన్ ప్లానర్లు, పరిశ్రమల భాగస్వాములు, డెవలప్‌మెంట్ ఫోరమ్‌ల నుంచి వచ్చిన సహకారం నియమాలను సరళమైనవిగాను, పారదర్శకమైనవిగాను, కాలానుగుణంగా మార్పులు చెందగలిగే విధంగాను మలచడానికి కొత్త రూల్స్ పునాదిగా ఉండేలా రూపొందించారు. జీహెచ్ఎంసీ, సీడీఎంఏ, జలమండలి, విద్యుత్ శాఖ, మూసి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ బోర్డ్, హైడ్రా, మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, డీటీసీపీ వంటి కీలక శాఖల భాగస్వామ్యంతో రూపొందించారు. వీటితోపాటు కొత్త నియమాలు వినియోగదారుకు అనుకూలంగా ఉండాని క్రెడాయ్, నరెడ్కో, ఐటీపీఐ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్, సీఐఐ, టీబీఎఫ్, ఐజీబీసీ సంస్థలు తమ అభిప్రాయాలను సైతం అందజేశారు. అన్నింటిని పరిశీలించిన తర్వాతనే డ్రాఫ్ట్ రిపోర్ట్‌ను రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు.

చైర్మన్ నుంచి ప్రభుత్వానికి

యూనిఫైడ్ డెవలప్‌మెంట్ బిల్డింగ్ కోడ్‌కు రిపోర్ట్‌ను ఇప్పటికే కమిటీ చైర్మన్, హెచ్ఎండీఏ కమిషనర్‌కు అందజేశారు. కమిటీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి పంపించనున్నారు. ఈ రిపోర్ట్ మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులు పరిశీలించిన తర్వాత సీఎం, సంబంధిత శాఖ మంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించి, ఆమోదం తర్వాతే అభ్యంతరాల స్వీకరణకు నోటిఫికేషన్ జారీచేసే అవకాశముంది. ఈ ప్రక్రియను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక 2026 నుంచి కొత్త బిల్డింగ్ రూల్స్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

Next Story