బ్రిజ్ భూషణ్ సరే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంగతేమైంది?

by GSrikanth |   (  Updated:2023-06-03 14:45:05  IST  )

గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

బ్రిజ్ భూషణ్ సరే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంగతేమైంది?
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధింస్తున్నాడని కొంత మంది మహిళా రెజ్లర్లు రోడ్డెక్కడం సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో రెజ్లర్ల ఆందోళనపై మంత్రి కేటీఆర్, కవిత ఇటీవల రియాక్ట్ అయ్యారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొటున్న బీజేపీ ఎంపీని కేంద్రం కాపాడుతోందని ధ్వజమెత్తారు. అయితే రెజ్లర్ల పోరాటంపై రియాక్ట్ అయిన కేటీఆర్, కవితలు సొంత పార్టీకి చెందిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇష్యూపై మాత్రం కనీసం స్పందించకపోవడంపై విమర్శలకు తావిస్తోంది.

బీజేపీకో న్యాయం బీఆర్ఎస్‌కు మరో న్యాయమా?

బ్రిజ్ భూషణ్‌ను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం శ్రమిస్తోందని అతడికి మోడీ అమిత్ షా అండగా నిలుస్తున్నారని కేటీఆర్ విమర్శిస్తే, రెజ్లర్లకు జరుగుతున్న అన్యాయం ప్రపంచం మొత్తం చూస్తోందని కవిత మండిపడ్డారు. నిందితుడు బహిరంగంగా తిరుగుతుంటే బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదని ఇకనైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా ఆమె కోరారు. అయితే రెజ్లర్ల ఆందోళనపై స్పందించిన కేటీఆర్, కవిత సొంత పార్టీకి చెందిన దుర్గం చిన్నయ్యపై ఓ మహిళ గత కొంత కాలంగా చేస్తున్న ఆరోపణలపై కనీసం స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దుర్గం చిన్నయ్య, అతడి అనుచరులు తనను వేధిస్తున్నారని ఆరిజన్ డైరీ ఎంపీ శేజల్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు మహిళలను పంపించాలని కోరుతున్నాడని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే తీరును ఏకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేసింది. ఇటు పార్టీ, అటు ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడంతో గత్యంతరం లేక ఢిల్లీలో పోరాటం ప్రారంభించింది.

ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆగడాలు తాళలేకపోతున్నానని ఇక తనకు మరణమే శరణ్యం అంటూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోనే ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో సొంత పార్టీపై ఓ మహిళ చేస్తున్న పోరాటం చేస్తుంటే సాటి మహిళ కవిత, మంత్రి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో కేటీఆర్ ఏనాడూ స్పందించలేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గొప్పలు చెప్పుకునే సీఎం కేసీఆర్ సైతం సొంత ఎమ్మెల్యే బాగోతంపై కనీసం విచారణ జరపకపోవడం విచారకరం అనే టాక్ వినిపిస్తోంది. శేజల్ ఆరోపణల్లో నిజం ఎంత అనేది సైతం విచారణ జరపడం లేదని, బీఆర్ఎస్ పాలనలో ఓ మహిళ వ్యక్తం చేస్తున్న ఆవేదన అరణ్యరోదనగా మారుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శేజల్ ఆవేదనను పట్టించుకోని కేటీఆర్, కవితలు బ్రిజ్ భూషన్ విషయంలో మాత్రం రాజకీయం చేస్తున్నారని.. బ్రిజ్ భూషన్‌పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతునే బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్గం చిన్నయ్యపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే తప్పులను కప్పిపుచ్చుతూ బీజేపీ ఎంపీ విషయంలో మాత్రం విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్‌కు ఓ న్యాయం బీజేపీకి మరో న్యాయం ఉంటుందా? అని మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

కేసీఆర్ సాధించింది అప్పులు, కమీషన్లు, ఆత్మహత్యలు: వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల

Next Story