పరిశ్రమ వ్యర్థాలపై నిర్లక్ష్యం సహించం.. మంత్రి కొండా సురేఖ సీరియస్

by Ramesh Naini |   (  Updated:2026-04-02 16:10:31  IST  )

జడ్చర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి ప్రాంతంలో పరిశ్రమల వ్యర్థాలను లెదర్ పార్క్ భూముల్లో అక్రమంగా పారబోస్తున్న ఘటనపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిశ్రమ వ్యర్థాలపై నిర్లక్ష్యం సహించం.. మంత్రి కొండా సురేఖ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జడ్చర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి ప్రాంతంలో పరిశ్రమల వ్యర్థాలను లెదర్ పార్క్ భూముల్లో అక్రమంగా పారబోస్తున్న ఘటనపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమని మంత్రి మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల ఫిర్యాదులకు స్పందించని అధికారులు సాధారణ ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో సమాధానం చెప్పాలని నిలదీశారు.అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.

సోమవారం సచివాలయంలో జరిగే సమీక్ష సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. అలాగే రెడ్ జోన్ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొనాలని సూచించారు. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు, పరిశ్రమల వ్యర్థాల నిర్వహణలో కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.

Next Story