- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సారెస్పీ కాలువల ఆధునీకరణలో ప్రభుత్వాల నిర్లక్ష్యం : జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత
పాలకుల నిర్లక్ష్యంతోనే ఎస్సారెస్పీ రెండో దశ కాలువల పరిస్థితి దారుణంగా మారిందని, రిజర్వాయర్ల ఏర్పాట్లలో కూడా మొదటి నుంచి నిర్లక్ష్యమే కనపడిందని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత విమర్శించారు.

దిశ, తుంగతుర్తి : పాలకుల నిర్లక్ష్యంతోనే ఎస్సారెస్పీ రెండో దశ కాలువల పరిస్థితి దారుణంగా మారిందని, రిజర్వాయర్ల ఏర్పాట్లలో కూడా మొదటి నుంచి నిర్లక్ష్యమే కనపడిందని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత విమర్శించారు. గత పన్నెండేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆమె శనివారం తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఎస్సారెస్పీ రెండో దశ కాలువలతోపాటు రుద్రమ చెరువు, అసంపూర్తి నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలను పరిశీలించారు. కొత్తగూడెం గ్రామ వద్ద అమరుడు మారోజు వీరన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో ఆమె విలేఖరులతో మాట్లాడారు.విప్లవోద్యమాలకు పురిటిగడ్డగా తుంగతుర్తి పేరుగాంచిందన్నారు. సాయుధ పోరాటం నాటి నుంచి జరిగిన ఎన్నో ఉద్యమాల్లో ఎంతో మంది అమరులయ్యారని పేర్కొన్నారు. బండి ఎనుక బండి కట్టి అనే పాట రాసిన బండి యాదగిరి ది కూడా ఇదే జిల్లా అంటూ గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి ఎక్కడ ఆగిపోయింది? మా లాంటి సంస్థలు జిల్లా అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై దృష్టి పెట్టామని వివరించారు.
జనం బాటలో పరిస్థితులపై ఆరా..
జనం బాటలో భాగంగా స్కూల్స్, హాస్పిటల్స్, నీటి వనరులు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పంట కాల్వల మెయింటెనెన్స్ సరిగా లేదన్నారు. కాల్వల్లో కంప చెట్లు పెరిగాయన్నారు. వీటి మెయింటెనెన్స్ కోసం బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఒక్కపైసా విడుదల చేయలేదన్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి కనీసం నిధులు కూడా ఇవ్వలేదన్నారు. కిలోమీటర్ కు పైగా డిస్ట్రిబ్యూటరీ కాల్వ తవ్వకపోవటం కారణంగా రుద్రమ చెరువులోకి గోదావరి నీళ్లు రావటం లేదని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పెద్దలు ఈ చెరువును రిజర్వాయర్ చేస్తామని రెండు ఎన్నికల్లో మాట ఇచ్చి నిర్లక్ష్యం చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ చెరువును లక్నవరం మాదిరిగా టూరిస్ట్ ప్లేస్ చేస్తామని మాట మరిచిందన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ టూ లో భాగంగా నల్గొండ జిల్లాలో రిజర్వాయర్లు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి మేలు జరిగేలా రిజర్వాయర్లు కట్టే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలన్నారు. తుంగతుర్తిలో40 ఏండ్లుగా ఉన్న 30 పడకల ఆసుపత్రిని వంద పడకలకు 2018లో మార్చి రెండుసార్లు శంకుస్థాపనలు జరిగినప్పటికీ నేటికీ పూర్తి కాలేదన్నారు. దీనివల్ల ఆరు మండలాల ప్రజలకు సరైన వైద్య సదుపాయం లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. విధి లేని పరిస్థితుల్లో ప్రజలంతా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. వీలైనంత తర్వగా ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాలు జిల్లా అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి, రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్ పాల్గొన్నారు.






