నీట్ యూజీ 2026 పేపర్ లీక్.. స్పందించిన ఏబీవీపీ కీలక డిమాండ్

by Ramesh Naini |

డాక్టర్ కావడమనేది లక్షల మంది విద్యార్థుల కల కానీ పేపర్ లీక్ ఘటనలు కష్టపడి చదివే విద్యార్థుల ఆశలను చిదిమేస్తాయని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

నీట్ యూజీ 2026 పేపర్ లీక్.. స్పందించిన ఏబీవీపీ కీలక డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: డాక్టర్ కావడమనేది లక్షల మంది విద్యార్థుల కల కానీ పేపర్ లీక్ ఘటనలు కష్టపడి చదివే విద్యార్థుల ఆశలను చిదిమేస్తాయని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ యూజీ 2026 పరీక్షా నిర్వహణలో అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నీట్ పరీక్షకు సంబంధించి వెలుగులోకి వస్తున్న అక్రమాలు, ప్రశ్నపత్రాల లీక్ ఆరోపణలు, అలాగే పరీక్షల విశ్వసనీయతపై తలెత్తుతున్న సందేహాలపై ఏబీవీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. నీట్ యూజీ పరీక్షకు సంబంధించి గతంలో కూడా పరీక్షా పత్రాల లీక్ జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుంటే పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలపై విద్యార్థులు నమ్మకం కోల్పోతుందన్నారు.

సంవత్సరాల తరబడి పడిన వారి కష్టం, కాలం వృధా అయిపోతాయని తద్వారా విద్యార్థుల్లో కలిగే నిరాశ, నిస్పృహ,ఆందోళన ఏ పరిస్థితికైనా దారి తీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవేశ పరీక్షల గోప్యత, నిర్వహణ, విశ్వసనీయతను సవాల్ చేస్తున్న మాఫియాలు, వ్యవస్థీకృత యాజమాన్యాలు, వారికి సహకరిస్తున్న వ్యక్తులు, వ్యవస్థలకు ఇంకోసారి తప్పు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story