- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష
దేశవ్యాప్తంగా మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ - 2026 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

- హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 20 నిమిషాల సమయం వృథా
దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ - 2026 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 551 నగరాలు, 14 అంతర్జాతీయ కేంద్రాల్లో మొత్తం 5,432 సెంటర్లలో 20 లక్షల మందికి పైగా (దరఖాస్తు చేసింది 22.79లక్షల మంది) విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. ఇక తెలంగాణలో 199 సెంటర్లలో సుమారు 71,500 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 97 శాతానికి పైగా మంది పరీక్షకు హాజరయ్యారు. కాగా రాష్ట్రంలో తెలంగాణలో 73,084 వేల మంది నీట్ యూజీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అధికారుల తప్పిదంతో 20 నిమిషాల సమయం వృథా
హన్మకొండలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పరీక్షా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిబంధనల ప్రకారం జరగాల్సిన ప్రక్రియలో జాప్యం జరగడంతో అభ్యర్థులు అమూల్యమైన సమయాన్ని కోల్పోయారు. మధ్యాహ్నం 1:30 గంటలకు గేట్లు మూసివేసిన వెంటనే అభ్యర్థులకు ఓఎంఆర్ షీట్లు అందజేయాలి. పరీక్ష ప్రారంభ సమయం (మధ్యాహ్నం 2:00 గంటల) లోపు సంతకాలు, ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఈ కేంద్రంలో ఇన్విజిలేటర్లు మధ్యాహ్నం 2 గంటలకు ఓఎంఆర్ షీట్లు పంపిణీ చేశారు. అంతేకాకుండా.. అభ్యర్థులందరూ ఓఎంఆర్ షీట్లలో వివరాలు నింపి, సంతకాలు పూర్తి చేసే వరకు క్వశ్చన్ పేపర్లను ఓపెన్ చేయనివ్వలేదు. ఈ మొత్తం ప్రక్రియ ముగిసి విద్యార్థులు పరీక్ష రాయడం మొదలుపెట్టేసరికి 2:20 గంటలు అయింది. అధికారుల అవగాహనా రాహిత్యం వల్ల సుమారు 20 నిమిషాల సమయం వృథా అయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నిమిషం ఎంతో కీలకమైన ఇటువంటి పోటీ పరీక్షలో 20 నిమిషాల సమయం కోల్పోవడం వల్ల తమ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా సరిగ్గా లేదని, 2 గంటల లోపు బయటకు మంచి నీళ్లు తాగేందుకు వెళ్లడానికి కూడా అనుమతించలేదని పలువురు అభ్యర్థులు వాపోయారు. ఈ ఘటనపై బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే అధికారుల తప్పిదం స్పష్టంగా తెలుస్తుందని, అవసరమైతే ఈ విషయంలో కోర్టును ఆశ్రయిస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.






