- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లైడ్ హెల్త్ సైన్సెస్ కు ఇక నీట్ తప్పనిసరి
దేశంలో అలైడ్ అండ్ హెల్త్‌కేర్ రంగంలో కీలక మార్పులు చేపట్టిన నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్

అల్లైడ్ హెల్త్ సైన్సెస్ కు ఇక నీట్ తప్పనిసరి
- ఎన్.సి.ఎ.హెచ్.పి కీలక నిర్ణయం
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో అలైడ్ అండ్ హెల్త్‌కేర్ రంగంలో కీలక మార్పులు చేపట్టిన నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ (ఎన్.సి.ఎ.హెచ్.పి) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి పలు అండర్‌గ్రాడ్యుయేట్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇకపై ఇంటర్ లేదా సమానమైన అర్హతతో ఈ కోర్సులు చేయాలనుకునే విద్యార్థులు, ఆయా కోర్సుల ప్రత్యేక అర్హత ప్రమాణాలతో పాటు నీట్‌లో అర్హత సాధించాల్సిందేనని కమిషన్ తెలిపింది. గత నెల విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై తాజాగా ఎన్.సి.ఎ.హెచ్.పి స్పందించింది. ఇప్పటివరకు అలైడ్ అండ్ హెల్త్‌కేర్ విభాగంలో 13 అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల వివరాలను నోటిఫై చేసింది. ఇవన్నీ 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. కమిషన్ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త కరిక్యులమ్స్ ను విడుదల చేయనుంది.
2021లో అమల్లోకి వచ్చిన ఎన్.సి.ఎ.హెచ్.పి చట్టం ప్రకారం, ప్రతి కోర్సుకు అవసరమైన అర్హతలు కొత్త కరిక్యులమ్ లోనే పొందుపరచబడ్డాయి. వీటిలో ఎక్కువ శాతం కోర్సుల్లో నీట్ అర్హతను తప్పనిసరి నిబంధనగా పేర్కొన్నారు. అదే సమయంలో, ‘పారామెడికల్’ అనే పదాన్ని నిలిపివేసి, దాని స్థానంలో ప్రొఫెషనల్‌గా ఆమోదించిన “అలైడ్ అండ్ హెల్త్‌కేర్” అనే పదాన్ని ఉపయోగించాలని కూడా కమిషన్ సూచించింది. ఇక ఫిజియోథెరపీ, ఆప్టోమెట్రీ, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, డయాలిసిస్ టెక్నాలజీతో పాటు పలు థెరపీ ఆధారిత కోర్సుల్లో ప్రవేశానికి కూడా నీట్ తప్పనిసరి అయింది. దేశవ్యాప్తంగా అలైడ్ హెల్త్ ఎడ్యుకేషన్‌లో నాణ్యత పెంచడం, ప్రవేశ విధానాలను ఒకే తరహాలో అమలు చేయడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చారు. దీంతో ఇకపై రాష్ట్రాల్లో ఎంసెట్ తరహా ప్రవేశపరీక్ష నుంచి అల్లైడ్ హెల్త్ సైన్సెస్ కు ప్రవేశాలకు దాదాపు మార్గం మూసుకుపోయినట్లే.
డాక్టర్ ఓకే... కానీ...
మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి తీసుకున్న మరో ముఖ్య నిర్ణయం ప్రకారం... ఫిజియోథెరపీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు తమ పేరుకు ముందు ‘డాక్టర్’ అనే బిరుదును ఉపయోగించవచ్చని... అయితే తప్పనిసరిగా వారి పేరు తర్వాత వెంటనే ‘పీటీ’ (ఫిజియోథెరపిస్ట్) అనే సఫిక్స్‌ను ఉంచాల్సి ఉంటుంది. తద్వారా వారిని మెడికల్ డాక్టర్లు లేదా పీహెచ్‌డీ డాక్టర్ల నుంచి వేరుగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.






