SIR పై చర్చకు ఎన్డీయే ప్రభుత్వం భయపడుతోంది : నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి

by Muthe.Rajitha |

పార్లమెంట్ డ్రామా సెంటర్ లాగా మారిపోయిందని, ఇండియా కూటమి ఎంపీలందరం.. ఎస్ఐఆర్ పైన చర్చ జరపాలని కోరుతుంటే.. ఎన్డీయే సర్కారు భయపడుతోందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు.

SIR పై చర్చకు ఎన్డీయే ప్రభుత్వం భయపడుతోంది : నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్ డ్రామా సెంటర్ లాగా మారిపోయిందని, ఇండియా కూటమి ఎంపీలందరం.. ఎస్ఐఆర్ పైన చర్చ జరపాలని కోరుతుంటే.. ఎన్డీయే సర్కారు భయపడుతోందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మల్లు రవి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ, ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై చర్చ జరగాలని అడిగిన ప్రతీసారి సభను వాయిదా వేస్తున్నారని, ఎన్డీయే ప్రభుత్వం అసలు ఏ అంశంపైనా చర్చలు జరపడం లేదన్నారు. ప్రతిపక్ష సభ్యులు చర్చల కోసం డిమాండ్ చేస్తే.. ప్రధాని డ్రామాలు అంటున్నారు. మేము ప్రజల తరఫున ప్రశ్నలు అడగటం డ్రామానా.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ సీఎం పెద్ద పోరాటం చేస్తున్నారని, కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు.

చర్చ జరిపితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని, క్వశ్చన్ అవర్‌లో కూడా ప్రతిపక్ష సభ్యులను ఎన్డీయే వారు తిడుతున్నారని మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో ఒక్క గంట కూడా పార్లమెంటు జరగలేదని, ప్రజల పన్నులతో నడిచే సభా సమయాన్ని వృథా చేస్తున్నారని, మీరు పార్లమెంట్‌ను నడిపే అర్హతను కోల్పోయారని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్‌ను అయినా నడపండి.. ప్రభుత్వం నుంచి అయినా దిగిపోండన్నారు. రెండు రోజుల్లో ప్రధాని మోడీ ఒక్క నిమిషం కూడా సభకు రాలేదని, మీకు పార్లమెంట్ అంటే గౌరవం లేదని మల్లు రవి విమర్శించారు. 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరగుతుందని, దీని వల్ల జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు.

కేంద్రం తీసుకొచ్చిన సంచార్ యాప్ పైన అనుమానాలు ఉన్నాయి : భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని, సమావేశాలను డిస్ట్రబ్ చేయాలనే ఉద్దేశ్యం మాకు లేదని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఓట్లను కుదించాలని ఎస్ఐఆర్ తెచ్చిందని, కేంద్రం తీసుకువచ్చిన సంచార్ యాప్ విషయంలో మాకు అనుమానాలు ఉన్నాయన్నారు. సంచార్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఈ ద్వారా వ్యక్తిగత సమాచారం, కుటుంబ సభ్యుల సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు సమాచారాన్ని ట్రాక్ చేయడానికి సంచార్ యాప్ ను వాడుతున్నారని, సంచార్ యాప్ పై కేంద్రం పునరాలోచించుకోవాలని ఆయన తెలిపారు. రాజకీయాల్లో పారదర్శకత ఉండాలని, సంచార్ యాప్ లాంటివి తీసుకువచ్చేటప్పుడు అందరి అభిప్రాయాలను తీసుకొని చర్చ చేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు.

Next Story