- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇగో, అక్రమ సంబంధాలు, మద్యం.. NCRB నివేదికలో ఆందోళనకర అంశాలు
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో నేరాలు సైతం అదే స్థాయిలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో నేరాలు సైతం అదే స్థాయిలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. కోపం వచ్చినా, ఇగో దెబ్బతిన్నా మనుషు లు క్షణికావేశంలో రాక్షసులుగా మారుతున్నారు. నిండు ప్రాణాలను కిరాతకంగా బలితీసుకుంటున్నారు. ఏటా నగరంలో సగటున 250 నుంచి 300 వరకు హత్యలు జరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఏడాది గడిచిన ఐదు నెలల వ్యవధిలోనే నాలుగు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 60కి పైగా హత్యలు, 150కి పైగా హత్యాయత్న కేసులు నమోదయ్యాయంటే నేరగాళ్లు ఎంతలా బరితెగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చిన్నపాటి వాగ్వాదాల నుంచి కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి వివాదాల వరకు.. కారణం ఏదైనా కత్తులు దూస్తున్నారు.
విస్మయానికి గురిచేస్తున్న కారణాలు
హత్యలకు దారితీస్తున్న కారణాలు వింటే ఎవరైనా విస్మయం చెందాల్సిందే. ఆవేశం, మద్యం మత్తు మనుషుల ఆలోచనా శక్తిని ఎంతలా దిగజార్చుతున్నాయో ఈ ఘటనలే నిదర్శనం. ఇటీవల నగరంలో కేవలం రూ.500 కోసం ఓ వ్యక్తి తన సొంత మిత్రుడినే దారుణంగా హతమార్చాడు. మరో ఘటనలో భార్య తనకు నచ్చిన కూర వండలేదనే చిన్న కారణంతో ఓ భర్త ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి దారుణాలకు పాల్పడిన నిందితులు తర్వాత పోలీసుల ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించడం గమనార్హం.
ఇగో దెబ్బతింటే.. సవాల్ చేసినా వదల్లేదు
సామాన్యులు ఆవేశంతో హత్యలకు పాల్పడుతుంటే, సమాజంలో పలుకుబడి ఉన్న కొందరు తమ ఇగో దెబ్బతిందన్న కక్షతో ప్రాణాలు తీస్తున్నారు. తమకున్న డబ్బు, రౌడీల అండతో చట్టం నుంచి సులభంగా తప్పించుకోవచ్చనే భ్రమలో ఉంటున్నారు. తాజాగా దశాబ్దాలుగా న్యాయవాది మొయిజుద్దీన్‌తో ఉన్న పగను మనసులో పెట్టుకున్న ముజాహిద్ ఆలంఖాన్ అలియాస్ నవాబ్ సాబ్ ఉదంతమే దీనికి సజీవ సాక్ష్యం. సినీ, రాజకీయ ప్రముఖులతో సంబం ధాలు, క్షణాల్లో ఏదైనా చేయగల అనుచరుల బలగం ఉన్న నవాబ్ సాబ్.. తనపై న్యాయపోరాటం చేస్తున్న ఓ న్యాయవాదిని జీర్ణించుకోలేకపోయాడు. ఏకంగా సాక్ష్యాలు ఉంటే తనను అరెస్టు చేయాలంటూ పోలీసులకే సవాల్ విసిరాడు. అయితే, పోలీసులు పక్కా ఆధారాలతో ఉచ్చు బిగించగానే వణికిపోయాడు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు, ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.
సోషల్ మీడియా తెస్తున్న తంటాలు..
టెక్నాలజీ విస్తరించిన తర్వాత వైవాహిక బంధాలు బీటలు వారుతున్నాయి. కుటుంబాలకు పరిచయం ఉన్న వ్యక్తులు లేదా సోషల్ మీడియా ద్వారా పరిచయమైన అపరిచితులతో వివాహేతర సంబంధాలు పెట్టు కుని కాపురాల్లో చిచ్చు పెడుతున్నారు. అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారనే నెపంతో కట్టుకున్న భార్యను లేదా భర్తను ప్రియుడు, ప్రియురాలితో కలిసి కిరాతకంగా హతమార్చడానికి వెనకాడటం లేదు. ఫలితంగా అటు తల్లి మరణించి, ఇటు తండ్రి జైలుపాలై.. ఆ పసిపిల్లలు దిక్కులేని అనాథలుగా మారుతున్నారు.
నేరం చేసి దాగలేరు.. నిమిషాల్లో దొరికేస్తున్నారు
నేరం చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలా అని నేరగాళ్లు వందల ప్రణాళికలు వేస్తుంటారు. కానీ, ఆధునిక సాంకేతికత, సీసీటీవీల యుగం లో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవడం దాదా పు అసాధ్యంగా మారింది. భార్యను చంపి, ముక్క లు చేసి, కాల్చి, ఆ బూడిదను నీళ్లలో కలిపేసి.. ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేశానని భ్రమించి న గురుమూర్తి అనే కిరాతకుడిని పోలీసులు రెండు రోజుల్లోనే కటకటాల వెనక్కి నెట్టారు. కరడుగట్టిన నేరగాళ్లను సైతం గంటల వ్యవధిలోనే పట్టుకోగల సాంకేతిక సామర్థ్యం ప్రస్తుతం పోలీ సుల వద్ద ఉంది. నేరం అనేది తెలిసి చేసినా, తెలియక చేసినా దాని పర్యవసానాలు జీవితాం తం వెంటాడుతాయి. నేరం చేద్దామనే ఆలోచన ఒక్కసారి మనసులోకి వస్తే వారి జీవితం గాలిలో దీపంలా మారిపోతుంది.
ఎన్సీఆర్‌బీ తాజా నివేదిక ప్రకారం..
జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్‌బీ) తాజా నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో 358 హత్య కేసులు నమోదయ్యాయి. ఈ హత్యల్లో 33 శాతం ఆర్థిక, భూవివాదాల కారణంగా జరగ్గా, 16 శాతం వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగినవే కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో వరకట్న వేధింపులు, ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఈ కేసుల్లో అరెస్టవుతున్న నిందితుల్లో అత్యధికులు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారే కావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. తల్లిదండ్రులకు, భార్యకు, పిల్లలకు ఆసరాగా నిలవాల్సిన యువత.. క్షణికావేశంతో జైళ్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.






