Seethakka: పేదరికం మూలంగానే రాష్ట్రంలో నక్సలైట్లు! మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

పేదరిక మూలంగానే ఈ రాష్ట్రంలో నక్సలైట్లు వచ్చారని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.

Seethakka: పేదరికం మూలంగానే రాష్ట్రంలో నక్సలైట్లు! మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పేదరిక మూలంగానే ఈ రాష్ట్రంలో నక్సలైట్లు వచ్చారని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన మండల సమాఖ్య అధ్యక్షుల రాష్ట్ర స్థాయి సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొన్నారు. నూతనంగా మండల సమాఖ్య అధ్యక్షులుగా ఎన్నికైన అందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పేదరిక మూలంగానే ఈ రాష్ట్రంలో నక్సలైట్లు వచ్చారని అన్నారు. మరి ముఖ్యంగా శ్రీకాకుళం వంటి మారుమూల ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల దోపిడీ భరించలేక ఎన్నో విప్లవ ఉద్యమాలు పుట్టుకొచ్చాయన్నారు. అందుకే కొప్పుల రాజు వంటి ఐఏఎస్‌లు మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు అందజేశారని వివరించారు. కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చాలని, వారందరినీ కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

మహిళలను కోటీశ్వరులను చేస్తాము అంటే కొంతమంది ఎద్దేవ చేస్తున్నారని మండిపడ్డారు. కానీ ఇప్పటికే చాలా మండల సమాఖ్యల్లో కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఏడాది రూ. 20 వేల కోట్లు తగ్గకుండా మహిళా సంఘాలకు బ్యాంకింగ్ రుణాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయన్నారు. ఎంతోమంది బడాబాబులు బ్యాంకులకు లోన్లు ఎగవేస్తుంటే.. మహిళా సంఘాలు 99 శాతం లోన్లు తిరిగి చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. వేల కోట్లు కొల్లగొట్టే లలిత్ మోడీల కన్నా.. తెలంగాణ ఆడబిడ్డలు నయం అని బ్యాంకులు భావిస్తున్నాయని సెటైర్లు వేశారు.

ఇప్ప పువ్వు లడ్డూలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి

కోట్ల వ్యాపారాలను మహిళా సంఘాలు ఇచ్చేందుకు మా ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు. పెట్రోల్ బంకుల ఏర్పాటుతో ప్రారంభమైన మహిళా సంఘాల ప్రయాణం.. ఇప్పుడు సోలార్ ప్లాంట్ల, రైస్ మిల్లు లు, గోదాములు నిర్వహించే స్థాయికి ఎదిగాయని వివరించారు. ఆదిలాబాద్‌లో ఆదివాసి బిడ్డలు తయారు చేసిన ఇప్ప పువ్వు లడ్డూలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయన్నారు. ఇప్ప పువ్వు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, అందుకే మూలుగులో ఇప్ప చెట్లు పెంచుతున్నామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆడబిడ్డలం మేము.. అణగదొక్కాలని చూస్తే ఆదిశక్తులమవుతాం

హైటెక్ సిటీ లో గల ఇందిర మహిళా శక్తి బజార్ తరహాలో మరిన్ని బజార్‌లు హైదరాబాద్ నల్లుమూలల ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో పట్టం కడుతున్నామన్నారు. లోకల్ ప్రోడక్స్‌కు గ్లోబల్ ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని, మన ప్రొడక్టులకు మరింత ప్రమోషన్ కల్పిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాలతోనే మహిళలకు గుర్తింపు.. ఆడ బిడ్డలం మేము.. అందర్నీ ఆదరిస్తాం.. అణగదొక్కాలని చూస్తే ఆదిశక్తులమవుతాము.. అని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story