జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీతో విజయం.. నవీన్ యాదవ్‌కు విప్ పదవి?

by Malleboina Mahesh |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ కు ప్రభుత్వ విప్ పదవి దక్కే అవకాశం ఉంది.

జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీతో విజయం.. నవీన్ యాదవ్‌కు విప్ పదవి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ కు ప్రభుత్వ విప్ పదవి దక్కే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు ప్రభుత్వ విప్ పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అసెంబ్లీలో ముగ్గురు ప్రభుత్వ విప్ లు ఉన్నారు. మరో నలుగురిని నియమించుకునే అవకాశం ఉంది.

అందుకోసం బీసీ సామాజికవర్గానికి చెందిన నవీన్ యాదవ్ కు ఆ పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇటీవల హైదరాబాద్ జిల్లా నుంచి అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు. అలాగే అదే జిల్లా నుంచి మరొకరికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం విప్ పదవి ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

యాదవ సామాజిక వర్గానికి ప్రయారిటీ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇంతకాలం గ్రేటర్ నుంచి ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో లేరు. ఇప్పుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నికవడం తో ఆయనకు విప్ పదవి ఇవ్వడం ద్వారా ఆ యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అలాగే విప్ హోదాలో నగరంలోని సమస్యలను పరిష్కరించేందుకు, అభివృద్ధి పనులపై అధికారులతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగే పార్టీని సైతం బలోపేతం చేసేందుకు వీలుంటుంది.

Next Story