విద్యుత్ బస్సుల విధానంపై దేశవ్యాప్త చర్చలు.. 23న చెన్నైలో కీలక జాతీయ సదస్సు

by Ramesh Naini |

ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 23న చెన్నైలో జరగనున్న జాతీయ సదస్సుకు టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలను హాజరుకావాలని ఎస్‌డబ్ల్యూ‌ఎఫ్ యూనియన్ ఆహ్వానించింది.

విద్యుత్ బస్సుల విధానంపై దేశవ్యాప్త చర్చలు.. 23న చెన్నైలో కీలక జాతీయ సదస్సు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీలకు మరింత అవకాశాలు కల్పించాలన్న డిమాండ్‌తో, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 23న చెన్నైలో జరగనున్న జాతీయ సదస్సుకు టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలను హాజరుకావాలని ఎస్‌డబ్ల్యూ‌ఎఫ్ యూనియన్ ఆహ్వానించింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు సంయుక్తంగా చేసిన ప్రకటనలో, విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణ హక్కులను ఆర్టీసీలకే ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానంలో సమూల మార్పులు అవసరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 56 ఆర్టీసీల కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొననున్న ఈ సదస్సులో, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫేమ్, పీఎంఈ-డ్రైవ్ వంటి పథకాల ద్వారా పీపీపీ మోడల్‌లో జీసీసీ కాంట్రాక్టులను ప్రవేశపెట్టడం వల్ల సబ్సిడీలు కార్పొరేట్లకు మళ్లుతున్నాయని వారు విమర్శించారు. ఈ విధానం ఆర్టీసీలను మరింత నష్టాల్లోకి నెడుతుందని, భవిష్యత్తులో ఆర్టీసీ బస్సుల వ్యవస్థ సైతం ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

కాలుష్య నియంత్రణ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న 1,40,000 ఆర్టీసీ బస్సులను పూర్తిగా విద్యుత్ బస్సులుగా మార్చాలన్న కేంద్ర నిర్ణయం ఉద్యోగ భద్రతపై ప్రభావం చూపుతుందని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వము కూడా హైదరాబాద్‌లో 2,000 బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చే ప్రక్రియను ప్రారంభించిందని గుర్తుచేశారు. ఈ మొత్తం పరిణామాలపై విస్తృత చర్చ జరిపి, దేశంలోని అన్ని ఆర్టీసీ కార్మిక సంఘాల అభిప్రాయాలను సమగ్రంగా తీసుకుని ఐక్యంగా ముందుకు వెళ్లడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు వీరాంజనేయులు, వీఎస్ రావు వెల్లడించారు.

Next Story