గ్రామీణ కనెక్టివిటీలో తెలంగాణ సత్తా.. టీ-ఫైబర్‌కు జాతీయ గుర్తింపు

by Ramesh Naini |

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక డిజిటల్ కనెక్టివిటీ ప్రాజెక్టు టీ-ఫైబర్‌కు మరో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.

గ్రామీణ కనెక్టివిటీలో తెలంగాణ సత్తా.. టీ-ఫైబర్‌కు జాతీయ గుర్తింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక డిజిటల్ కనెక్టివిటీ ప్రాజెక్టు టీ-ఫైబర్‌కు మరో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశంలో అత్యున్నత స్వతంత్ర గౌరవ పురస్కారాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎస్‌కేఓసీహెచ్ (స్కాచ్) అవార్డుకు టీ-ఫైబర్ ప్రాజెక్టు ఎంపికైంది. ఈ మేరకు స్కాచ్ సంస్థ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీ-ఫైబర్) మేనేజింగ్ డైరెక్టర్ వేణు ప్రసాద్ పన్నీరుకు అధికారికంగా లేఖ పంపింది. అవార్డు ఎంపికకు ముందు నిర్వహించిన అన్ని మూల్యాంకన దశలను టీ-ఫైబర్ విజయవంతంగా పూర్తి చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. డిజిటల్ కనెక్టివిటీని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం వంటి అంశాల్లో టీ-ఫైబర్ చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఈ నెల 20న న్యూఢిల్లీలోని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో జరగనుంది. 108వ ఎస్‌కేఓసీహెచ్ సమ్మిట్ సందర్భంగా నిర్వహించనున్నారు.

రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఫర్ విక్సిత్ భారత్ అనే అంశంపై జరిగే ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు, ప్రజా రంగ సంస్థలు, అభివృద్ధి కార్యక్రమాలకు విశేష సేవలందించిన సంస్థలకు పురస్కారాలు అందజేయనున్నారు. స్కాచ్ అవార్డు ప్రభుత్వాలు, సంస్థలు, అభివృద్ధి రంగంలో విశిష్ట సేవలు అందించిన సంస్థలకు ప్రదానం చేసే అత్యున్నత స్వతంత్ర గుర్తింపుగా దేశవ్యాప్తంగా పేరుగాంచింది. ఈ అవార్డుకు టీ-ఫైబర్ ఎంపిక కావడం తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దక్కిన మరో జాతీయ గుర్తింపుగా భావిస్తున్నారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా, వైద్య సంస్థలకు అధిక వేగం గల ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీ-ఫైబర్ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నదని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు.. ఈ ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సైతం తోడ్పాడు అందిస్తుండటంతో ఈ విజయాలు సాధ్యం అవుతున్నట్లు ఎండీ తెలిపారు.

Next Story