"అభయ్" గా తిప్పిరి తిరుపతి.. నేషనల్ మీడియాలో జోరుగా కథనాలు

by Muthe.Rajitha |   (  Updated:2025-10-21 09:03:06  IST  )

వరుస లొంగుబాట్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టు పార్టీ(Maoist Party)పై జాతీయ మీడియా వరుస కథనాలు ప్రసారం చేసింది.

అభయ్ గా తిప్పిరి తిరుపతి.. నేషనల్ మీడియాలో జోరుగా కథనాలు
X

దిశ, వెబ్ డెస్క్ : వరుస లొంగుబాట్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టు పార్టీ(Maoist Party)పై జాతీయ మీడియా వరుస కథనాలు ప్రసారం చేసింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్(Mallojula Venugopal) అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతోసహా ఇతర ముఖ్య నాయకులూ, వందలాది కమాండర్ల లొంగుబాటు అనంతరం పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని వరుస కథనాలతో నేషనల్ మీడియా హోరెత్తిస్తోంది. గత ఏప్రిల్ లో బసవరాజు మరణం అనంతరం పార్టీ జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ(Thippiri Tirupati alias Dev Ji) పార్టీని భుజాన వేసుకున్నట్టు తెలిపాయి. మావోయిస్టు పార్టీలో 'అభయ్' గా కూడా దేవ్ జీనే వ్యవహరిస్తున్నట్టు పేర్కొంది.

అయితే అంతకుముందు మల్లోజుల వేణుగోపాల్ 'అభయ్' పేరిట పార్టీ లేఖలు విడుదల చేసేవారు. మల్లోజుల లొంగుబాటుతో 'అభయ్'(Abhay) అనే మారుపేరుతో దేవ్ జీనే ప్రజలకు తమ ఉద్దేశం తెలిపే కీలక పాత్ర పోషిస్తున్నాడని వివరించాయి. పార్టీ నేతల లొంగుబాటు తర్వాత ఇప్పటివరకు అభయ్ పేరుతో రెండు పత్రికా ప్రకటనలు విడుదలయ్యాయి. ఒకటి మల్లోజులతో సహా లోంగిపోయిన సభ్యుల చర్యను ఖండిస్తూ.. మరొకటి అక్టోబర్ 24న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తూ లేఖలు విడుదల చేయబడ్డాయి.

లొంగిపోయిన నాయకులు పెట్టీ బూర్జువా సిద్ధాంతాలను, రైట్ వింగ్ ను తలకు ఎత్తుకున్నారని.. వారు పార్టీ ద్రోహులు, విశ్వాసఘాతకులు అంటూ తీవ్ర విమర్శలు చేస్తూ.. ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదని హెచ్చరిస్తూ అభయ్ పేరిట విడుదలైన లేఖ దేవ్ జీ రాసిందేనని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అంటూ పత్రికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సంచలన కథనాలపై ఇప్పటి వరకు ఇటు మావోయిస్టు పార్టీ నుంచి గాని, లొంగిపోయిన నాయకుల నుంచి గాని ఎలాంటి స్పందన రాలేదు.

Next Story