హైదరాబాద్‌లో చారిత్రక నాణేల జాతీయ స‌ద‌స్సు

by Muthe.Rajitha |

హైదరాబాద్‌ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది.

హైదరాబాద్‌లో చారిత్రక నాణేల జాతీయ స‌ద‌స్సు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో చారిత్రక నాణేల సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వారసత్వ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 11, 12 తేదీల్లో 107వ వార్షిక జాతీయ నాణేల సదస్సు , సెమినార్‌ను నిర్వహించనున్నారు. ఈ సదస్సు బ్రోచర్‌ను శుక్రవారం డా.బీఆర్. అంబేద్క‌ర్ సచివాలయంలో పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ఆవిష్క‌రించారు.

న్యూమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఐ) సహకారంతో తెలంగాణ వారసత్వ శాఖ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత నాణేల అధ్యయనంపై ఇంతటి ముఖ్యమైన జాతీయ స్థాయి కార్యక్రమం హైదరాబాద్‌లో జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నాణేల చరిత్ర ద్వారా తెలంగాణ రాష్ట్ర‌ గొప్ప చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని దేశానికి చాటి చెప్పేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు.

డిసెంబర్ 11, 12 తేదీల్లో సదస్సు:

జూబ్లీహిల్స్‌లోని డా. ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి ఇన్‌స్టిట్యూట్‌లో డిసెంబర్ 11, 12 న‌ రెండు రోజుల పాటు ఈ సదస్సు జ‌ర‌గ‌నుంది. భారతదేశ నలుమూలల నుంచి విద్యార్థులు, స్కాల‌ర్స్, పరిశోధకులు (రీస‌ర్చ‌ర్స్), న్యూమిస్‌మటిక్స్ నిపుణులు పాల్గొనే ఈ సదస్సు, నాణేల చారిత్రక, సాంస్కృతిక, కళాత్మక ప్రాముఖ్యతపై చర్చించేందుకు ఒక వేదికగా ఉపయోగపడనుంది. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, పురావ‌స్తు శాఖ‌ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్యదర్శి జయేష్ రంజన్, వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి, డిప్యూటీ డైరెక్టర్లు డా. డి. రాములు, డా. పి. నాగరాజు పాల్గొన్నారు.

Next Story