- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ పంచాయతీలకు జాతీయ అవార్డుల పంట.. మంత్రి సీతక్క హర్షం
జాతీయ స్థాయిలో తెలంగాణ పంచాయతీలు మెరిశాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రతిష్టాత్మక “దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు” (DDUPSVP) లో రాష్ట్రానికి చెందిన రెండు గ్రామ పంచాయతీలు (Telangana Panchayats) జాతీయ అవార్డులను దక్కించుకున్నాయి. గుడ్ ఫర్ గవర్నెన్స్ విభాగంలో వికారాబాద్ జిల్లా కోటేపల్లి మండలం మోతుకుపల్లి గ్రామ పంచాయతీ పురస్కారం దక్కించుకుంది. గ్రామ స్థాయిలో పారదర్శక పరిపాలన, ప్రజల భాగస్వామ్యం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో చూపిన ప్రతిభకు గుర్తింపు లభించింది. అలాగే సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండల పరిధిలోని ఫసల్వాడి గ్రామ పంచాయతీ 'విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ' విభాగంలో జాతీయ అవార్డుకు ఎంపికైంది. మహిళా సాధికారత, భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన కృషికి గాను ఈ అవార్డు దక్కింది.
సీతక్క అభినందనలు:
దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ముందంజలో ఉన్న పంచాయతీలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులు ప్రదానం చేస్తోంది. ఈ నేపధ్యంలో రెండు విభాగాల్లో తెలంగాణకు అవార్డులు రావడం పట్ల పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క (Seethakka) హర్షం వ్యక్తం చేశారు. “తెలంగాణ రాష్ట్రానికి చెందిన గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడం గర్వకారణం. గ్రామీణాభివృద్ధి, పారదర్శక పాలన, మహిళా సాధికారత దిశగా మా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది నిదర్శనం అన్నారు. అవార్డులు అందుకున్న మోతుకుపల్లి, ఫసల్వాడి గ్రామ పంచాయతీల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థాయి సిబ్బందిని అభినందిస్తున్నాను. ఇలాంటి విజయాలు ఇతర పంచాయతీలకు స్పూర్తిగా నిలుస్తాయని తెలిపారు.






