నాంపల్లి FSL ఘటన.. నాగ్‌పూర్ నిపుణుల టీమ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు!

by Ramesh Naini |

హైదరాబాద్‌లోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబరోటరీస్ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి.

నాంపల్లి FSL ఘటన.. నాగ్‌పూర్ నిపుణుల టీమ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు!
X

దిశ , తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబరోటరీస్ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనపై సమగ్ర సాంకేతిక పరిశీలన చేపట్టిన నాగ్‌పూర్ నిపుణుల ప్రత్యేక బృందం తమ ప్రాథమిక నివేదికను శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. ప్రత్యేక బృందం పరిశీలనలో సుమారు 1100 ఫైళ్లు పూర్తిగా దగ్ధమైనట్లు వెల్లడైంది. వీటిలో పలు కీలక క్రిమినల్ కేసులకు సంబంధించిన ఆధారాలు, డిజిటల్ రికార్డులు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సర్వర్లు, హార్డ్‌డిస్కులు తీవ్రంగా దెబ్బతినడంతో వాటిలోని డేటాను తిరిగి పొందడం సాంకేతికంగా సాధ్యం కాదని బృందం ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది.

స్టోరేజ్ పరికరాలు పూర్తిగా కాలిపోవడం!

స్టోరేజ్ పరికరాలు పూర్తిగా కాలిపోవడం వల్ల సమాచారం పునరుద్ధరణకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. విచారణలో ఉన్న పలు క్రిమినల్ కేసులపై ప్రభావం పడే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఫోరెన్సిక్ విశ్లేషణ నివేదికలు, డిజిటల్ సాక్ష్యాలు కోర్టు ప్రక్రియలో కీలకంగా మారే సందర్భాల్లో ఈ నష్టం ప్రభావం చూపవచ్చని బాధితులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో అగ్ని మాపక వ్యవస్థలు, డేటా బ్యాకప్ విధానాలు, సర్వర్ భద్రతా ప్రోటోకాల్‌లపై ప్రభుత్వం సమగ్ర సమీక్ష చేపట్టే అవకాశముంది. నాగపూర్ నిపుణుల బృందం సమర్పించే తుది నివేదికలో అగ్ని ప్రమాదానికి కారణాలు, నష్టం పరిమాణం, సాంకేతిక వైఫల్యాలు, బాధ్యత అంశాలు తదితర వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.

సైబర్ ఫోరెన్సిక్స్ మినహా అన్ని విభాగాలు.. డీజీ శిఖా గోయల్

రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో సైబర్ ఫోరెన్సిక్స్ విభాగం మినహా మిగతా అన్ని ప్రయోగశాలలు సాధారణంగా పనిచేస్తున్నాయని ఫోరెన్సిక్ డీజీ శిఖా గోయల్ తెలిపారు. అగ్ని ప్రమాదం ప్రభావం ప్రధానంగా సైబర్ ఫోరెన్సిక్స్ విభాగంపైనే పడిందని, ఇతర విభాగాలు యథావిధిగా పనిచేస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. సైబర్ విభాగానికి సంబంధించిన పరికరాలు, సర్వర్లు దెబ్బతిన్న కారణంగా అక్కడి కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్ విభాగాల సహాయాన్ని కూడా పొందే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడంతో పాటు డేటా భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని డీజీ తెలిపారు. త్వరలోనే సైబర్ ఫోరెన్సిక్స్ విభాగాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

Next Story