ఈతకు వెళ్లి కృష్ణా నదిలో యువకుడు మృతి – గ్రామంలో విషాదం

by Bhanu |

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నెమలిపురి (పులిచింతల ప్రాజెక్టు కాలనీ) వద్ద శుక్రవారం ఉదయం కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన యువకుడు మృతిచెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.

ఈతకు వెళ్లి కృష్ణా నదిలో యువకుడు మృతి – గ్రామంలో విషాదం
X

దిశ, చింతలపాలెం: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నెమలిపురి (పులిచింతల ప్రాజెక్టు కాలనీ) వద్ద శుక్రవారం ఉదయం కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన యువకుడు మృతిచెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం... పులిచింతల ప్రాజెక్టు కాలనీకి చెందిన కొమ్ము లోకేష్ (16) కోదాడ మండలం కాపుగల్లు హాస్టల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవుల నేపథ్యంలో పది రోజుల క్రితం ఇంటికి తిరిగొచ్చాడు.

శుక్రవారం ఉదయం తన స్నేహితులతో కలిసి కృష్ణా నదికి వెళ్లిన లోకేష్, ఈత నేర్చుకోవాలని ప్రయత్నించాడు. ఈత రాకపోవడంతో నడుముకు ఖాళీ డబ్బాలు కట్టి నీటిలోకి దిగాడు. అయితే అవి సరిగా ఫిట్ కాకపోవడంతో నీటిలో మునిగి పోయాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, మత్స్యకారులు గాలింపు చేపట్టగా కొంత దూరంలో లోకేష్ మృతదేహం లభ్యమైంది.ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. లోకేష్‌కు తల్లిదండ్రులు మరియు ఒక చెల్లి ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మరింత దర్యాప్తు జరుపుతున్నారు.






Next Story