కోటి విలువైన ఇంటి కోసం దారుణం.. యువతిని చంపి వాగులో పాతిపెట్టిన సవతి తల్లి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-11 14:40:53  IST  )

నల్గొండ జిల్లా వంగమర్తి మూసీ వాగులో యువతి మృతదేహం కలకలం రేపింది..

కోటి విలువైన ఇంటి కోసం దారుణం.. యువతిని చంపి వాగులో పాతిపెట్టిన సవతి తల్లి
X

దిశ, వెబ్ డెస్క్: నల్గొండ జిల్ల శాలిగౌరారం మండలం వంగమర్తి మూసీ వాగు(Vangamarthi Musi Vagu)లో యువతి మృతదేహం కలకలం రేపింది. మృతురాలు జనగామ జిల్లా దేవరుప్పల మండలం పడమటి తండాకు చెందిన మహేశ్వరి‌గా గుర్తించారు. మూడు నెలల క్రితం తన సవతి తల్లి లలిత హత్య చేసి మూసీ వాగులో పూడ్చిపెట్టినట్టుగా నిర్ధారణ అయింది. దీంతో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

జనగామ జిల్లా పడమటి తండాకు చెందిన ఈనా నాయక్.. తన మొదటి భార్య చనిపోవడంతో లతితను రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య కూతురే మహేశ్వరి. అయితే ఆమెకు పెళ్లి కుదరడంతో కోటి రూపాయల విలువైన ఇంటిని కట్నంగా ఇస్తానని తండ్రి ఈనా నాయక్ ఒప్పుకున్నారు. దీంతో ఆ ఇళ్లు తనకు కావాలని సవతి తల్లి లలిత భావించారు. తన బావ ఏఆర్ కానిస్టేబుల్ సాయంతో 2024 డిసెంబర్‌లో మహేశ్వరిని చంపి వంగమర్తి వద్ద మూసీ వాగులో పాతిపెట్టారు.

మరోవైపు తన కూతురు మహేశ్వరి కనిపించకపోవడంతో పోలీసులకు తండ్రి ఈనా నాయక్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వంగమర్తి వద్ద వాగులో మృతదేహం కనిపించిందని పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు వెళ్లిన పోలీసులు.. యువతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత గ్రామానికి తీసుకెళ్లారు. మహేశ్వరిని సవతి తల్లి లలితే చంపినట్లు తేలడంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహేశ్వరి హత్యలో ప్రమేయం ఉన్న వారి వివరాలను పోలీసులు రాబడుతున్నారు.

Next Story