రేపు యాదగిరిగుట్టకు ప్రపంచ సుందరీమణులు

by Bhanu |

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రాన్ని గురువారం ప్రపంచ సుందరీమణులు దర్శించుకోనున్నారు.

రేపు యాదగిరిగుట్టకు ప్రపంచ సుందరీమణులు
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రాన్ని గురువారం ప్రపంచ సుందరీమణులు దర్శించుకోనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకునేందుకు మిస్‌వరల్డ్‌ పోటీదారులు రానున్నారు. యాదగిరిగుట్ట ఆధ్యాత్మిక క్షేత్రం ప్రపంచస్థాయి ఈ ప్రపంచ సుందరీమణుల సందర్శనతో గొప్ప స్థాయిలో గుర్తింపు సాధించి టూరిజం స్పాట్‌లో గొప్పగా నిలవనుంది. ఓ పర్యాటక సందర్భంలో సాయంత్రం బ్రేక్‌ దర్శనం, వెండి జోడు సేవలు రద్దు చేశారు.‌ వీరి పర్యటన ముగిసిన వెంటనే యథావిధిగా ఆలయంలో కైంకర్యాలు కొనసాగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.‌ ప్రధానంగా నేడు సుందరీమణులు ముందుగా అఖండ దీపారాధన చేసి తర్వాత అక్కడినుంచి తూర్పురాజగోపురం (ఆలయం) వరకు వస్తారు.

అక్కడినుంచి స్వర్ణ దివ్య విమాన రాజగోపురం దర్శించుకొని త్రితల రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి, అదే మార్గంలోని క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి, ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత అంతరాలయంలోని స్వయంభువులను దర్శించుకొని అనంతరం ఉపాలయాల్లో ఆండాల్‌ అమ్మవారు, ఆళ్వార్లను దర్శించుకొని గర్భాలయానికి అభిముఖంగా ఆశీర్వచనం తీసుకుంటారు. అక్కడినుంచి ఆలయ అందాలు వీక్షిస్తూ పశ్చిమ రాజగోపురం ద్వారా ఆలయం వెలుపలకు వస్తారు. అనంతరం ఆలయ ప్రాకార మండపాలు, తిరువీధుల్లో పర్యటించి తిరుగు ప్రయాణమవుతారు.

భువనగిరి సేద తీరిన సుందరీమణులు...

వరంగల్ పర్యటన నేపథ్యంలో ప్రపంచ సుందరీమణులు వరంగల్ కు వెళ్తున్న నేపథ్యంలో భువనగిరిలో కాసేపు ఆగి సేద తీరారు. వరంగల్ - హైదరాబాద్ బైపాస్ లోని ఒక ప్రైవేటు హోటల్లో బుధవారం మధ్యాహ్నం ఆగి హోటల్లో బస చేశారు. ఈ సందర్భంగా పోలీసులు హోటల్ వద్ద జాతీయ రహదారిపై పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.



Next Story