మీ కోసం కాదు, మీ కుటుంబం కోసం.. బైక్ తోలేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి

by Batti.Sumithra |   (  Updated:2026-03-28 06:56:08  IST  )

ప్రాణాల విలువను గుర్తు చేస్తూ, కుటుంబాల బాధను నివారించాలనే సంకల్పంతో కోదాడ పట్టణంలో పోలీసులు నిర్వహించిన హెల్మెట్ అవగాహన ర్యాలీ భావోద్వేగంగా సాగింది.

మీ కోసం కాదు, మీ కుటుంబం కోసం.. బైక్ తోలేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి
X

దిశ, కోదాడ : ప్రాణాల విలువను గుర్తు చేస్తూ, కుటుంబాల బాధను నివారించాలనే సంకల్పంతో కోదాడ పట్టణంలో పోలీసులు నిర్వహించిన హెల్మెట్ అవగాహన ర్యాలీ భావోద్వేగంగా సాగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బైకు ర్యాలీ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించింది. టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా రంగా థియేటర్ వరకు కొనసాగింది. హెల్మెట్ ధరించి బైక్‌ల పై ప్రయాణించిన పోలీసులు “మీ కోసం కాదు... మీ కుటుంబం కోసం హెల్మెట్ పెట్టుకోండి” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ర్యాలీ అంతటా వినిపించిన నినాదాలు ప్రజలను కదిలించాయి. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ “ఒక్క క్షణం నిర్లక్ష్యం జీవితాంతం బాధగా మారొచ్చు. మీ ఇంట్లో ఎదురు చూస్తున్న వారి కోసం అయినా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి” అని భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం అంటే తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవడమేనని స్పష్టం చేశారు.

యువతిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల అనేక కుటుంబాలు దెబ్బతింటున్నాయని, అలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజల సహకారం ఉంటేనే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే సమాజం సురక్షితం అవుతుంది” అని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ శివ శంకర్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, టౌన్ ఎస్ఐ సుధీర్ కుమార్‌, ట్రాఫిక్ సిబ్బంది, యువత తదితరులు పాల్గొన్నారు.

Next Story