పాలల్లో కాలకూట విషం.. ప్రాణాలతో చెలగాటం!

by Ajay Maddhiboyina |

భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీ పాల దందా శరవేగంగా విస్తరిస్తోంది. రహస్య స్థావరాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్, డిటర్జెంట్ వంటి కెమికల్స్‌తో విషపు పాలు తయారు చేస్తున్నారు. హోటళ్లు, స్వీట్ షాపులకు ఈ అక్రమ పాలను యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు.

పాలల్లో కాలకూట విషం.. ప్రాణాలతో చెలగాటం!
X

భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీ పాల దందా శరవేగంగా విస్తరిస్తోంది. రహస్య స్థావరాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్, డిటర్జెంట్ వంటి కెమికల్స్‌తో విషపు పాలు తయారు చేస్తున్నారు. హోటళ్లు, స్వీట్ షాపులకు ఈ అక్రమ పాలను యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. కల్తీ పాలు తాగడం వల్ల చిన్నపిల్లలు, పెద్దలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. భవిష్యత్తులో అల్సర్, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా, శిక్షలు కఠినంగా లేకపోవడంతో అక్రమార్కుల అరాచకం ఆగడం లేదు. ఫుడ్ సేఫ్టీ అధికారుల అలసత్వం వల్ల దందా కొనసాగుతోందని స్థానికుల తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- దిశ, భూదాన్‌పోచంపల్లి

దిశ, భూదాన్‌పోచంపల్లి : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీ పాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కొందరు అక్రమ వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి, పౌష్టికాహారంగా భావించే పాలను కాలకూట విషంగా మారుస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కంటే డబ్బే ప్రధానంగా భావిస్తూ విష పదార్థాలను కలిపి యథేచ్ఛగా మార్కెట్లోకి వదులుతున్నారు. జిల్లా ఎస్ఓటీ పోలీసులు అడపాదడపా దాడులు చేసి నిందితులను అరెస్టు చేస్తున్నప్పటికీ, ఈ దందా ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. నెలల వ్యవధిలోనే వరుసగా కల్తీ పాలు వెలుగులోకి వస్తుండడంతో మండల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. స్వచ్ఛమైన పాలు దొరక్క, కల్తీ పాలు తాగి ఏ రోగం వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

హానికరమైన రసాయనాలతో తయారీ..!

పాల అవసరం ఎక్కువగా ఉన్న హోటళ్లు, స్వీట్ షాపులు, ప్రైవేట్ డైరీలను లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది. పాలు పాడవకుండా ఉండేందుకు అత్యంత ప్రమాదకరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. పాలు చిక్కగా కనిపించేందుకు నాణ్యతలేని డోలోఫర్ స్కీమ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లను కలుపుతూ నురుగు కోసం డిటర్జెంట్ పౌడర్‌ను, తెల్లగా మెరిసేందుకు యూరియాను కూడా వాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా, కృత్రిమ రంగు యూరియా, సువాసన కోసం ఇతర విషపూరితమైన కెమికల్స్‌ను కలుపుతున్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లోని రహస్య ప్రాంతాలు, ఫామ్ హౌస్‌లలో ఇలాంటి కృత్రిమ పాలను తయారు చేస్తూ పక్కా ప్రణాళికతో తెల్లవారుజామునే సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం..

కెమికల్స్ కలిపిన పాలు తాగడం వల్ల తక్షణమే వాంతులు, విరోచనాలు, కడుపులో తిప్పడం, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి దీర్ఘకాలంలో అల్సర్, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులకు దారితీస్తాయని, క్యాన్సర్ వంటి మహమ్మారి భారిన పడే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పుట్టిన పసికందుల నుంచి ఎదుగుతున్న చిన్నపిల్లల వరకు తాగే పాలల్లో ఇలాంటి ప్రాణాంతక పదార్థాలు కలపడం వల్ల వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛమైన ఆవు, గేదె పాల పేరుతో కేటుగాళ్లు అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ సొమ్ము దండుకుంటున్నారు.

ఆగని దందా.. అధికారుల అలసత్వం!

ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి నిందితులను పట్టుకుంటున్నప్పటికీ, కేసులు బలహీనంగా ఉండడం, శిక్షలు కఠినంగా లేకపోవడంతో అక్రమార్కులు భయం లేకుండా వ్యాపారం సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాడులు జరిగిన కొన్ని రోజులకే మళ్లీ కొత్త పేరుతో దందాను మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది. పర్యవేక్షణ బాధ్యత ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారని, నిరంతరం తనిఖీలు నిర్వహించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులు, కెమికల్స్ సరఫరా చేసే వారిని పట్టుకుని వారిపై పీడీ యాక్ట్ వంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ పాల తయారీ కేంద్రాలను శాశ్వతంగా సీజ్ చేయాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు మండలంలోని అన్ని గ్రామాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించడంతోపాటు, స్వచ్ఛమైన పాలను ఎలా గుర్తించాలో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి కల్తీ రాయుళ్లను సమాజం నుంచి వెలివేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story