- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గరిడేపల్లిలో వెరైటీ మోసం.. రూ.25వేలు కుచ్చుటోపి
మోసానికి కూడా కాదేది అనర్హం అన్న చందంగా మండల కేంద్రమైన గరిడేపల్లి లో ఇద్దరు అగంతకులు వెరైటీగా మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

దిశ, గరిడేపల్లి : మోసానికి కూడా కాదేది అనర్హం అన్న చందంగా మండల కేంద్రమైన గరిడేపల్లి లో ఇద్దరు అగంతకులు వెరైటీగా మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నేటి ఇంటర్నెట్, డిజిటల్ యుగంలో ఎదుటివారికి అర్థం కాకుండా సులువుగా, తెలివిగా మోసం చేస్తున్న సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాలు, డిజిటల్ మోసాలు ఇలా ఒకటేమిటి ఇటీవల ఎన్నడూ తెలియనటువంటి , జరగనటువంటి వింతగా అనిపించే వెరైటీ మోసాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే మండల కేంద్రమైన గరిడేపల్లి లో రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్ ఎదురుగా హైవే పక్కన మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే ఇద్దరు అగంతకులు షిఫ్ట్ కారులో వచ్చి దర్జాగా రూ.25 వేల ర విలువగల సామాగ్రిని మోసం చేసి తీసుకుని వెళ్లిపోయారు. గరిడేపల్లి లోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సాయి బాలాజీ కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ షాప్ లో కి ఒక కారులో ఇద్దరు అగంతకులు వచ్చారు. షాపు యజమాని శ్రీరామ్ సీతారాములను కిరాణం సరుకులు కావాలని అడిగారు.
ఏమేం కావాలని యజమాని అడగ్గా.. మంచి నూనె క్యాన్లు ఐదు, బియ్యం బస్తాలు ఐదు, ఇలా వివిధ రకాల కిరాణం సరుకులను తీసుకొని 25 వేలకు పైగా బిల్లు చేశారు. ఈ ఇద్దరు అగంతకులలో ఒకరు స్వామి మాల ధరించి ఉన్నాడు. అతను దుకాణ యజమానితో మాట్లాడుతూ సరుకులు చెబుతుండగా సదరు కిరాణం సరుకులను మరొక అగంతకుడు తీసుకువెళ్లి కారులో పెట్టారు. అంతా అయిపోయిన అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా బిల్లు ఎంత అయింది అని అడిగాడు. యజమాని సీతారాములు రూ.25వేలకు పైగా అయిందని చెప్పాడు. సదరు అగంతకుడు వెంటనే ఫోన్ తీసి యజమాని ఫోన్ నెంబర్ అడిగి ఫోన్ పే ద్వారా 25 వేల రూపాయలు కొట్టినట్లు చూపించి హడావుడిగా కారు వద్దకు వెళ్లాడు. అతను వేసిన డబ్బులు ఫోన్ పే ద్వారా రాకపోవడంతో విషయాన్ని గమనించిన యజమాని సీతారాములు వెంటనే బయటికి వచ్చి డబ్బులు రాలేదని చెబుతుండగానే అగంతకులు కారు ఎక్కి పరారయ్యారు. దీంతో యజమాని లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కి పరిగెత్తాడు. వెంటనే నేరేడుచర్ల లో తెలిసిన వారికి ఫోన్ చేసి కార్లు ఏదైనా వస్తే ఆపి చెక్ చేయమని ఆదేశించారు. కానీ అప్పటికే అగంతుకుల కారు మరోవైపుకి మళ్ళీ వెళ్లిపోయింది. గరిడేపల్లి మెయిన్ రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాలలో అగంతకులు వెళ్తున్న కారు నంబర్ తో సహా నమోదయింది. ఆ నెంబర్ తీసుకుని పోలీస్ స్టేషన్లో విచారణ చేయగా ఆ నెంబరు హుజూర్ నగర్ లోని ఒక లారీకి సంబంధించిందిగా గుర్తించారు. అంటే అగంతకులు కారుకు తప్పుడు నెంబర్ తగిలించి మోసం చేసేందుకు తెగించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి మోసం జరగలేదని చూడలేదని అక్కడ ఉన్న స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. దీంతో సదరు యజమాని చేసేది ఏమీ లేక పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయంపై ఫిర్యాదు చేశారు. ఇక మొత్తానికి ఘరానా మోసగాళ్లకు ఆధునిక టెక్నాలజీ అండగా నిలుస్తుంది అనడానికి గరిడేపల్లి లో కిరాణం దుకాణంలో జరిగిన వెరైటీ మోసం అద్దం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.






