ఎస్‌ఐఆర్ భారం.. బీఎల్‌ఓలు బలి!

by Ajay Maddhiboyina |

ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం కిందిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులపై విపరీతమైన పనిభారాన్ని మోపుతోంది. తమ సొంత శాఖల విధులతోపాటు అదనంగా బీఎల్‌ఓలుగా పనిచేయాల్సి రావడం సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారింది.

ఎస్‌ఐఆర్ భారం.. బీఎల్‌ఓలు బలి!
X

ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం కిందిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులపై విపరీతమైన పనిభారాన్ని మోపుతోంది. తమ సొంత శాఖల విధులతోపాటు అదనంగా బీఎల్‌ఓలుగా పనిచేయాల్సి రావడం సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారింది. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, బిల్ కలెక్టర్లు ఉదయం నుంచి రాత్రి వరకు విశ్రాంతి, సెలవులు లేకుండా క్షేత్రస్థాయిలోనే గడుపుతున్నారు. ఒకవైపు ఉన్నతాధికారుల సమీక్షలు, టార్గెట్లు.. మరోవైపు రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో బీఎల్‌ఓలు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. గతంలో ప్రకటించిన రూ.12వేల పారితోషికం ఇవ్వకుండా, కేవలం రూ.4వేల అడ్వాన్స్‌తోనే ప్రభుత్వం సరిపెట్టింది. ప్రయాణ ఖర్చులు, మొబైల్ డేటా ఛార్జీలను కూడా ఉద్యోగులు తమ సొంత డబ్బుల నుంచే భరించాల్సి వస్తోంది. ఎస్‌ఐఆర్ పూర్తయ్యే సరికి ప్రతి ఒక్కరికీ రూ.30వేల ప్రత్యేక భత్యం ఇచ్చి, పాత బకాయిలు తీర్చాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.

- దిశ, మిర్యాలగూడ రూరల్

దిశ, మిర్యాలగూడ రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం కిందిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఓటరు జాబితా సవరణ పేరుతో అప్పగించిన అదనపు బాధ్యతలతో సిబ్బంది తీవ్ర పనిభారం, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, మున్సిపల్ బిల్ కలెక్టర్లు తదితర విభాగాల ఉద్యోగులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ ఆఫీసర్లుగా (బీఎల్‌ఓ) విధులు నిర్వహిస్తున్నారు. తమ సొంత శాఖల రోజువారీ పనులతోపాటు అదనంగా ఈ ఎన్నికల విధులు కూడా చేయాల్సి రావడం వల్ల ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.

అధికారుల వేధింపులు.. రాజకీయ ఒత్తిళ్లు..

ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాల సేకరణ, ధ్రువీకరణ, వివిధ ఫారాల స్వీకరణ, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, అభ్యంతరాల పరిష్కారం వంటి పనుల వల్ల బీఎల్‌ఓలు నిరంతరం క్షేత్రస్థాయిలోనే గడపాల్సి వస్తోంది. ఈ ఎస్‌ఐఆర్ పనులను గడువులోగా పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు తరచూ సమీక్షలు నిర్వహిస్తూ టార్గెట్లు పెడుతుండగా, మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల నుంచి కూడా తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయిలో చిన్న పొరపాటు జరిగినా అధికారులు వివరణలు కోరుతూ నోటీసులు ఇస్తున్నారని, కనీసం విశ్రాంతి, సెలవులు కూడా లేకుండా పనిచేస్తున్నా తమ కష్టానికి గుర్తింపు లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందని పారితోషికం.. చేతిచమురు వదులుతున్న వైనం..

గతంలో బీఎల్‌ఓలకు రూ.12వేల వరకు పారితోషికం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, విడతల వారీగా కేవలం రూ.2వేల చొప్పున మాత్రమే కొంత మొత్తం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ ఎస్‌ఐఆర్ ప్రారంభానికి ముందు రూ.4వేల అడ్వాన్స్ ఇచ్చిన అధికారులు, ఆ తర్వాత ఇప్పటి వరకు రూపాయి కూడా విదిల్చలేదు. దీంతో గ్రామాలు, వార్డుల్లో తిరగడానికి అయ్యే ప్రయాణ ఖర్చులు, ఆన్‌లైన్ అప్‌లోడ్ కోసం మొబైల్ డేటా ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయాలను బీఎల్‌ఓలు తమ సొంత డబ్బుతోనే భరించాల్సి వస్తోంది. అరకొర జీతాలు తీసుకునే తమపై ఈ అదనపు ఆర్థిక భారం వేయడం ఎంతవరకు న్యాయమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

రూ.30వేల ప్రత్యేక భత్యం ఇవ్వాలి

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఈ ఓటర్ల సర్వే ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి బీఎల్‌ఓకు కనీసం రూ.30వేల ప్రత్యేక పారితోషికం చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అదనపు విధులకు ప్రత్యేక భత్యం కల్పించాలని కోరుతున్నారు. అదనపు సిబ్బంది లేకుండా నిరంతర లక్ష్యాలతో పనిచేయడం వల్ల తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన భత్యాలు కల్పించి తమ సమస్యలను పరిష్కరించాలని పలువురు ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రోజురోజుకి పని భారం పెరుగుతుంది

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తున్నప్పటికీ పని భారం రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణ ఎన్నికల విధులతోపాటు ఎస్‌ఐఆర్ పనులు, ఇంటింటి సర్వేలు, ఆన్‌లైన్ నమోదు, పత్రాల పరిశీలన వంటి అనేక బాధ్యతలు అప్పగించడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. అదనపు సిబ్బంది లేకుండా, తగిన పారితోషికం లేకుండా నిరంతర లక్ష్యాలతో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. బీఎల్‌ఓలపై ఉన్న ఈ అధిక పని భారాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి తగిన సౌకర్యాలు, అదనపు సిబ్బందిని, న్యాయమైన భత్యాలు కల్పించాలి.

- బొందు పార్వతి, బీఎల్ఓ, మిర్యాలగూడ

Next Story