ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ మాయాజాలం..

by Kodari Anjali |

ఫామ్ ల్యాండ్ పేరుతో భవిష్యత్తు బాగుంటుందని అమాయకులకు వలవేసి అంతులేని అవినీతికి వెంచర్ యజమాన్యం పాల్పడుతుంది.

ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ మాయాజాలం..
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్: ఫామ్ ల్యాండ్ పేరుతో భవిష్యత్తు బాగుంటుందని అమాయకులకు వలవేసి అంతులేని అవినీతికి వెంచర్ యజమాన్యం పాల్పడుతుంది. అంతేకాకుండా రైతుబంధు, రైతు బీమా పథకాలు వర్తిస్తాయి అని ప్రచారం చేస్తూ సామాన్యులను పద్మవ్యూహంలో చిక్కుకునేలా సాయి వనం ఫామ్ ల్యాండ్ వెంచర్ యజమానులు మోసాలకు పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మ లరామారం మండలం మైలారం గ్రామంలో ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సాయి వనం ఫామ్ హౌస్ విల్లా పేరుతో వెంచర్ ను ఏర్పాటు చేశారు. మైలారం గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 238/లూ, 243/ఉ, 246/ఈ 1/1/1, 247/రూ /1/1, 248/ఉ, 265/ఊ2ఓ లలో ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 13.27 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి విల్లాల నిర్మాణం చేసి అమాయక ప్రజలను నట్టేట ముంచుతున్నారు.

మార్కెటింగ్ మాయాజాలం...

రియల్ ఎస్టేట్ వ్యాపారులు రకరకాలుగా విభజించి వ్యాపారం చేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. వెంచర్ చేసేది ఒకరైతే.. మార్కెటింగ్ చేస్తూ విక్రయాలు నిర్వహించేది మరోకరు. సెలవు రోజులు ఉంటే చాలు హైదరాబాదు నుంచి కస్టమర్లను తీసుకువచ్చి విందు భోజనం వడ్డించి విల్లా ప్లాట్లు అంటగట్టే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ వేసవి సెలవుల్లో హైదరాబాద్ లో నివాసం ఉండే వినియోగదారులకు మాయమాటలు చెప్పి ప్లాట్లు అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఒక సంస్థలో సమిష్టి ఉద్యోగం చేసే వారిలో ఒక్కరిని బుజ్జగించి ఆశలు చూపించి వారితో ఆ సంస్థలో ఉన్న వాళ్లందర్నీ ప్లాట్లు కొనుగోలు చేసేలా ముగ్గులోకి దించుతారు. సెలవు రోజులు కదా అలా సరదాగా వెళ్దాం.... వెంచర్లు చూద్దాం.... అంతా రియల్ వ్యాపారులే చూసుకుంటారని బురిడీ కొట్టిస్తారు. ఎక్కువగా హైదరాబాదు ప్రాంతాలు చెందిన వాళ్ళే ప్లాట్లు కొనుగోలు చేస్తూ మోసపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్ వేర్, ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉన్నత ఉద్యోగులు అనుమతి లేని ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయామని తెలుసుకొని ఎవరితో చెప్పుకోవాలో తెలియక మదన పడుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.

40 లక్షలు పెట్టుబడి... రూ.2 కోట్ల ఆదాయం...

వెంచర్ చేయడానికి అవసరమైన భూమిని కొనుగోలు చేయడానికి ఒక ఎకరాకు రూ. 40 లక్షలు నుంచి 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేస్తారు. డీటీసీపీ, రేరా, గ్రామపంచాయతీతో పాటు అన్ని రకాల అనుమతులు తీసుకుంటే 10% భూమి గ్రామ పంచాయతీకి, కొంత భూమి స్థానిక సంస్థల పేరు మీద మార్ట్ గేజ్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రోడ్లు వేసి అభివృద్ధి చేసి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటే కస్టమర్లకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ చేయడం ఎందుకని దొడ్డిదారిన అమ్మకాలు చేసి లబ్ది పొందేందుకు ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ ఫామ్ ల్యాండ్ దందాను దర్జాగా కొనసాగిస్తున్నారు. అందమైన బ్రోచర్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఆఫర్లు పెట్టి ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఒక ఎకరానికి 40 గుంటల భూమి ఉంటే... గజానికి రూ.8000 చొప్పున ధర నిర్ణయించి ప్లాట్లు అమ్మకాలు చేస్తు రెండు గుంటల ( 242 గజాలు) పేరుతో విక్రయిస్తు న్నారు. ఒక్క ఎకరం భూమి దాదాపు రూ. 40 లక్షల కొనుగోలు చేసి వెంచర్ పేరుతో రూ.2.50 కోట్లకు వెంచర్ ను విక్రయిస్తున్నారు.

Next Story