భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..

by Kodari Anjali |

భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారంతో రెండో రోజుకు చేరుకుంది.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..
X

దిశ, చౌటుప్పల్ టౌన్: అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ కార్యదర్శి గోశిక కరుణాకర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్‌లోని చిన్నకొండూరు చౌరస్తా వద్ద భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారంతో రెండో రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని గోశిక కరుణాకర్ సందర్శించి కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదైన కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని కోరారు. ప్రమాద బీమా, విద్యా సహాయం, ప్రసూతి ప్రయోజనాలు వంటి పథకాలతో పాటు 55 సంవత్సరాలు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.5,000 పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక చర్యలు చేపట్టాలి..

అలాగే ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ కార్డు సదుపాయం కల్పించాలని కోరారు. వివాహ కానుకలు తదితర సంక్షేమ పథకాల నిధులను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి భద్రత కల్పించడంతో పాటు కనీస వేతనాలను పెంచి అమలు చేయాలని, కార్మికుల కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడంతో కార్మికుల జీవనం మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎండి. పాషా, గునమోని రాములు, కలకుంట్ల శివ, నెల్లికంటి నరసింహ, చీమకండ్ల శ్రీరాములు, మాండారి మార్క్, జాజుల బిక్షపతి, గజ్జెల రాజు, ఉబ్బు యాదయ్య, సుక్క యాదయ్య, సువర్ణ, దుర్గం గాలయ్య, ఊదరి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Next Story