300 ఏళ్ల తర్వాత ఇండియాకు చోళ రాగి పలకాలు

by Sujitha Rachapalli |

చోళులది సముద్రాలను ఏలిన గొప్ప నాగరికత. నాగపట్టణం నుంచి మలయా ద్వీపాల వరకు వ్యాపించిన వారి వాణిజ్యం.. సంస్కృతి ఇప్పటికీ మనల్ని ఆకర్షిస్తాయి.

300 ఏళ్ల తర్వాత ఇండియాకు చోళ రాగి పలకాలు
X

దిశ, ఫీచర్స్: చోళులది సముద్రాలను ఏలిన గొప్ప నాగరికత. నాగపట్టణం నుంచి మలయా ద్వీపాల వరకు వ్యాపించిన వారి వాణిజ్యం.. సంస్కృతి ఇప్పటికీ మనల్ని ఆకర్షిస్తాయి. ఆ కాలపు గుర్తులైన 24 రాగి పలకాలు మూడు వందల ఏళ్ల తర్వాత ఐరోపా నుంచి తిరిగి మన నేలకు వచ్చాయి. ఇది కేవలం పురాతన వస్తువుల ప్రత్యాగమనం కాదు. మన పూర్వీకుల గొప్పతనానికి.. సముద్రాలను అనుసంధానం చేసిన సాహసానికి నాస్టాల్జిక్ గుర్తుగా నిలుస్తుంది.

300 ఏళ్ల నిశ్శబ్దం..

18వ శతాబ్దం ప్రారంభంలో ఈస్టిండియా కంపెనీ తమిళ తీరాన్ని ఆక్రమించింది. అప్పుడు నాగపట్టణం వీధుల్లో అనిశ్చితి నిండిపోయి చోళ సామ్రాజ్యపు రాగి పలకాలను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 30 కేజీల బరువున్న 24 పలకాలను భూమిలో పాతిపెట్టారు. అయితే ఆ పలకాలను డచ్ మతాధికారి ఫ్లోరెంటియస్ కాంపర్ ద్వారా 1712లో హాలండ్‌కు తరలించాడు. అవి లైడెన్ యూనివర్సిటీ ఆర్కయివ్‌లో 300 ఏళ్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. తమిళనాడు కూడా వాటిని మరచిపోయింది. ఈ రాగి పలకాలు రాజ రాజ చోళుడి కాలంలో మొదలై రాజేంద్ర చోళుడు కాలంలో ఖరారు చేయబడ్డాయి.

రెండు భాషలూ..

చోళులు నాగపట్టణం సమీపంలోని అనైమంగలం గ్రామం చుట్టుపక్కల వ్యవసాయ భూములను బౌద్ధ విహారం ‘చులమణివర్మ విహారం’ కోసం దానం చేశారు. ఆశ్చర్యంమేంటంటే దీనిని నిర్మించింది తమిళ రాజు కాదు.. శ్రీ మార విజయోత్తుంగవర్మన్ అనే శ్రీ విజయ సామ్రాజ్య రాజు. హిందూ చక్రవర్తి ఒక బౌద్ధ సంస్థకు భూమి ఇవ్వడం, సముద్రానికి అవతల ఉన్న రాజుతో స్నేహం చేయడం చోళుల విశాల దృక్పథానికి నిదర్శనం. దాని వల్ల పలకాలపై తమిళం, సంస్కృతం రెండూ ఉన్నాయి. ఒకటి వంశావళిని చెప్తే.. మరొకటి భూమి సరిహద్దులు, పన్నులు, నీటి పారుదల వివరాలు చెప్తుంది.

ఆదాయంలో 30 శాతం..

ఒకప్పుడు అరేబియా, చైనా, ఆగ్నేయాసియా, తూర్పు ఆఫ్రికా వ్యాపారులు ఇక్కడికి వచ్చేవాళ్లు. మణిగ్రామం, అయ్యవోలే, ఐన్నూరువర్ వంటి తమిళ వర్తక సంఘాలు సముద్రాలను దాటి వ్యాపారం చేసేవి. సముద్ర వాణిజ్యం నుంచి వచ్చే ఆదాయం చోళ సామ్రాజ్యం మొత్తం ఆదాయంలో 30 శాతం వరకు ఉండేదట. చోళుల పలకాలు ఆనాటి జీవన స్పందనను గుర్తు చేస్తాయి. బౌద్ధులతో, ఆగ్నేయాసియా రాజులతో, చైనా వర్తకులతో స్నేహం చేయడంలో చోళులు ఎప్పుడూ సంకోచించలేదు. బౌద్ధ విహారానికి కూడా భూమి ఇవ్వడమనేది వారి సాంస్కృతిక సానుకూలతకు నిదర్శనంగా చెప్పొచ్చు.

పుట్టింటికి ఫలకాలు..

2012 నుంచి ఇండియా ఈ పలకాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. 2023లో అధికారిక అభ్యర్థన, లైడెన్ యూనివర్సిటీ సమితి సిఫార్సు తర్వాత ఈ ప్రత్యాగమనం సాధ్యమైంది. 2026 మే 16న హేగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, డచ్ ప్రధాని రాబ్ జెట్టెన్ సమక్షంలో ఈ పలకాలు భారత్‌కు అధికారికంగా తిరిగి అందాయి. వీటి రాకతో మన చారిత్రక వారసత్వం తిరిగి ఇంటికి వచ్చినట్లయిందంటున్నారు జనాలు. వీటి రాకతో మన పూర్వీకులు సముద్రాలను జయించిన ఆత్మవిశ్వాసం, వివిధ సంస్కృతులను ఆహ్వానించిన ఔదార్యాన్ని ఈ రాగి పలకాలు మనకు గుర్తు చేస్తాయి.

Next Story