ఉబ్బసం రోగులకు రేపు చేప ప్రసాదం పంపిణీ

by Taduka Kalyani |

మృగశిర కార్తిని పురస్కరించుకుని బత్తిన కుటుంబం పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఉబ్బసం రోగులకు రేపు చేప ప్రసాదం పంపిణీ
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : మృగశిర కార్తిని పురస్కరించుకుని బత్తిన కుటుంబం పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమయ్యే చేప మందు పంపిణీ 24 గంటల పాటు కొనసాగనుంది. అనంతరం దూద్ బౌలి లోని బత్తిన ఇంటి వద్ద మూడు రోజుల పాలు పంపిణీ చేయనున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే ఈ చేప ప్రసాద పంపిణీకి కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహర్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, చత్తీస్ ఘఢ్ తదితర రాష్ట్రాల నుంచి అస్తమా బాధితులు వస్తుంటారు. ఫిష్ మెడిసిన్ తీసుకునేందుకు గాను ఇప్పటికే ఎగ్జిబిషన్ మైదానానికి ఉబ్బస వ్యాధి గ్రస్తులు రావడం మొదలు కాగా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు .ఆర్ అండ్ బీ అధికారులు షెడ్లు, ఫ్లడ్ లైట్లు,క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచారు. జీహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్, జలమండలి మంచినీటి సరఫరా ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీని దివంగత బత్తిన హరినాథ్ గౌడ్ కుమారుడు అమర్ నాథ్ గౌడ్, సోదరుడు గౌరీశంకర్ లు పంపిణీ చేయనున్నారు.

34 కౌంటర్ల ద్వారా పంపిణీ...

చేప ప్రసాదం పంపిణీ చేసే సోమ, మంగళ వారాల్లో సుమారు లక్షకు పైగా అస్తమా బాధితులు వస్తారని అధికారులు అంచనా వేసి వారికి సరిపోయేలా చేప ప్రసాదం సిద్ధం చేశారు. మత్స్యశాఖ ఇప్పటికే 1.4 లక్షల కొర్రమీను చేపపిల్లలను రెడీగా ఉంచింది. చేప ప్రసాదాన్ని శాకాహారులకు బెల్లంతో అందజేస్తారు. చిన్నపిల్లల నుంచి వందేళ్ల వృద్ధుల వరకు ఎవరైనా ఈ చేప ప్రసాదం వేసుకోవచ్చని, అయితే గర్భిణులు మాత్రం తీసుకోవద్దని నిర్వాహకులు తెలిపారు. చేప ప్రసాదాన్ని పరగడుపున లేదా భోజనం తీసుకున్న మూడు గంటల తర్వాత తీసుకోవాలని సూచించారు. ఇందుకు గాను ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 34 కౌంటర్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు, కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. వీఐపీ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం తీసుకోవాలనుకునే వారు పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 40 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

టోకెన్లపై టైం కేటాయింపు...

ఫిష్ మెడిసిన్ పంపిణీ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకు గాను అధికారులు వినూత్న చర్యలు తీసుకున్నారు . ఇందులో భాగంగా రోగులకు ఇచ్చే టోకెన్లపై సమయం ముద్రించారు . ప్రతి రెండు గంటలకు ఒక సారి టోకెన్లపై టైమింగ్స్ మారుతుంటాయి. టోకెన్లు అందుకున్న వారు వారికి కేటాయించిన సమయంలోనే క్యూ లైన్లలోకి రావాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా క్యూ లైన్ల లోకి వచ్చే వారిని అనుమతించబోరు. ఉబ్బస రోగులకు టోకెన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ప్రసాదం పంపిణీ మొదలయ్యే సమయం వరకు టోకెన్ల పంపిణీ ఉంటుంది .చేప ప్రసాదం తీసుకోవాలనుకునే వారు పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 40 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రారంభించనున్న మంత్రులు...

చేప ప్రసాద పంపీణీని సోమవారం రాత్రి 9 గంటలకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ , వాకిటి శ్రీహరి, మహ్మద్ అజారుద్ధీన్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించనున్నారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు , కార్పొరేషన్ల చైర్మెన్లు , పలు ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వృద్ధులు, వికలాంగులకు అదనంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు.

ఉచిత భోజనం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు...

ఫిష్ మెడిసిన్ కోసం వచ్చే అస్తమా బాధితులు, వారి సహాయకులకు పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం, నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉచితంగా సరఫరా చేస్తున్నాయి. పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు . వేల సంఖ్యలో చేప ప్రసాదం కోసం బాధితులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది కూడా ఎలాంటి ఘటనలు జరిగినా ఎదుర్కొవడానికి చర్యలు చేపట్టింది.

ప్రత్యేక బస్సులు నడుపనున్న ఆర్టీసీ...

చేప ప్రసాదం కోసం దేశవ్యాప్తంగా ఉన్న బాధితులు రైళ్లు, బస్సుల్లో నగరానికి వస్తుండడంతో వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఆదివారం ఉదయం నుండి ఫిష్ మెడిసిన్ పంపిణీ ముగిసేంత వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, కాచిగూడ రైల్వే స్టేషన్‌, జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఈసీఐఎల్‌ ఎక్స్‌ రోడ్‌, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వంటి ప్రాంతాల నుండి కూడా ప్రత్యేక బస్సులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా పలు వైద్య బృందాలను ,అంబులెన్స్ లను అందుబాటులో ఉంచింది. మొత్తం మీద చేప ప్రసాదం పంపిణీకి వచ్చే ఉబ్బస రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఫిషరీస్, జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ , ఫైర్ , పోలీస్ తదితర విభాగాల అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. ఇందులో భాగంగా బత్తిన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఎగ్జిబిషన్ మైదానం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు . మంత్రి అజారుద్ధీన్ కూడా రెండు రోజుల క్రితం ఎగ్జిబిషన్ మైదానాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు .

Next Story