పదేళ్లయినా పటాన్ చెరులో అభివృద్ధి శూన్యం : కల్వకుంట్ల కవిత

by Batti.Sumithra |

తెలంగాణ వచ్చిన నాటి నుండి పటాన్ చెరు ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఇక్కడి స్థితిగతులు కూడా ఏమీ మారలేదని తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

పదేళ్లయినా పటాన్ చెరులో అభివృద్ధి శూన్యం : కల్వకుంట్ల కవిత
X

దిశ, పటాన్ చెరు టౌన్ : తెలంగాణ వచ్చిన నాటి నుండి పటాన్ చెరు ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఇక్కడి స్థితిగతులు కూడా ఏమీ మారలేదని తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పటాన్ ఇంచార్జ్ తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలు తెలంగాణ బతుకమ్మ పాటలతో, పూలమాలలతో సత్కరించి ఆమెకు ఘనస్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కూడలి వద్ద ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కవిత మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన పటాన్ చెరు నేడు పూర్తిగా పొల్యూషన్ ప్రాంతంగా కూరుకు పోయిందన్నారు. 30 ఏళ్ల నాటి నుంచి ఇక్కడి ప్రజలు పొల్యూషన్ తో సతమతమవుతున్నా, పాలకులు పట్టించుకోలేదన్నారు. అటువంటి పటాన్ చెరులో ఉండే నక్క వాగు ఇక్కడి కాలుష్యానికి పూర్తిగా ఎండిపోయి, మంజీరా నీటితో కలిసి కలుషితం అవుతుందని అన్నారు. పరిశ్రమల నుంచి వెదజల్లుతున్న కాలుష్యం మూలంగా నేడు ఈ ప్రాంతం భూమి లోపల కిలోమీటర్ల లోతు కలుషితమైందని, ఇక్కడ బోర్ వేస్తే మంచి నీరు తాగే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ భవనం నిర్మించాలంటే పొల్యూషన్, బోర్ వేయాలంటే పొల్యూషన్, ఏదైనా పంట పండించే పరిస్థితి కూడా లేకపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి పరిశ్రమలు తరలిస్తామని చెబుతున్న పాలకులు,

దానికి బదులుగా వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఏవి ? దేశ నలుమూలల నుండి ఇక్కడ స్థిరపడ్డ ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడున్న వనరులను, భూములను కాపాడ్డానికి, ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పుడున్న పటాన్ చెరు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో, ఆయనకు కూడా తెలియదని, ఓట్లేసి గెలిపించిన ప్రజల్లో మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. మినీ ఇండియాగా పేరు ఉన్న పటాన్ చెరులో అభివృద్ధి జరిగిందా అంటే చెప్పుకోలేని దుస్థితి నెలకొందన్నారు. అభివృద్ధి మాట పక్కన పెడితే ఎమ్మెల్యే ఆర్థిక వనరులు మాత్రం బాగా అభివృద్ధి జరిగాయని ఆరోపించారు. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి ఉన్నా ఎంపీ బీఆర్ఎస్ కు ఓటు వేసి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు తెర తీశారన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే ఇక్కడున్న పార్టీలన్నీ కలిసికట్టుగా ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆమె విమర్శించారు. నిన్నకాక మొన్న ఒక ప్రభుత్వ పాఠశాలను బుల్డోజర్లతో కబ్జా ప్రయత్నం జరుగుతుంటే, ప్రజలు యుద్ధం చేసినా కలెక్టర్ కనీసం స్పందించి కాంపౌండ్ వాల్ కట్టలేదన్నారు.

ఇక్కడి ప్రాంతంలో ఏదైతే పొల్యూషన్ ఉన్నదో దానిని తగ్గించడానికి, పేదల అభివృద్ధికి, ఇక్కడున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ కల్పన వంటి ప్రధాన సమస్యల పై తమ పార్టీ ప్రణాళికలు రూపొందించి చిత్తశుద్ధితో ముందుకెళ్తుందన్నారు. ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఇండస్ట్రీలు నెలకొల్పడం కాదని, ఇక్కడ చదువుకున్న యువత ఇండస్ట్రీ పెట్టే రోజు రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోనే కానీ, జిల్లాలోనే జరుగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కలుషితం లేని రాజకీయం, కరప్షన్ లేని తెలంగాణ కోసం ప్రజలకు సుస్థిర పాలన అందించడానికి తెలంగాణ రక్షణ సేన ఒక నిబద్దతతో ముందుకెళుతోందని, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగించడానికి కృషి చేస్తున్నామని కవిత స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి బాలయ్య, పటాన్ చెరు ఇంచార్జ్ చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు విష్ణు చారి, మలిశెట్టి బాపు, బట్టి అజయ్, స్థానిక నాయకులు ప్రవీణ్, దాసోజీ శ్రీనివాస్ లతో పాటు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story