ఖాకీ ముసుగులో మద్యం వ్యాపారం..?

by Kodari Anjali |

ప్రజా భద్రత కోసం ఖాకీ యూనిఫాం ధరించి విధులు నిర్వర్తించాల్సిన ఓ హోంగార్డు పేరు ప్రస్తుతం కారేపల్లి మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఖాకీ ముసుగులో మద్యం వ్యాపారం..?
X

దిశ, కారేపల్లి: ప్రజా భద్రత కోసం ఖాకీ యూనిఫాం ధరించి విధులు నిర్వర్తించాల్సిన ఓ హోంగార్డు పేరు ప్రస్తుతం కారేపల్లి మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసు శాఖలో పనిచేస్తున్న సదరు హోంగార్డు మద్యం వ్యాపార కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. వైరల్ అవుతున్న దృశ్యాల్లో సదరు హోంగార్డు వైన్‌షాప్‌లో కూర్చొని మద్యం అమ్మకాలు లెక్కలు పరిశీలిస్తున్నట్లు కనిపిస్తుండటంతో ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు విధుల్లో ఉండాల్సిన వ్యక్తి వ్యాపార వ్యవహారాల్లో ఎలా నిమగ్నమవుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

15 ఏళ్లుగా ఒకేచోట విధులు... అధికార పరిచయాల ప్రభావమా?

స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు సన్నిహితంగా ఉంటూ కారేపల్లి ప్రాంతంలోనే కొనసాగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు హోంగార్డు సుమారు 15 ఏళ్లుగా అదే ప్రాంతంలో విధులు నిర్వహించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఏర్పడిన అధికార పరిచయాలు, స్థానిక ప్రభావాన్ని ఉపయోగించుకుని పలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కారేపల్లిలో ఆయన కుటుంబ సభ్యుల పేరుతో నిర్వహిస్తున్నట్లు చెబుతున్న వైన్‌షాప్ వ్యవహారాల్లో కూడా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం వేళల్లో వైన్ షాపులోనిర్వహణను పర్యవేక్షించడం, సిబ్బందికి సూచనలు ఇవ్వడం, విక్రయాల లెక్కలు పరిశీలించడం వంటి కార్యకలాపాల్లో కనిపిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

సొంత ఇంట్లో బెల్ట్‌షాపుల తరహాలో విక్రయాలా?

మండలంలోని తన స్వగ్రామంలో మినీ బార్ తరహాలో మద్యం సేవకులకు కూర్చునే సదుపాయం కల్పించి, మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక విక్రయ కేంద్రాల వెలుపల మద్యం సరఫరా జరుగుతోందా అనే అంశంపై సంబంధిత శాఖలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉండే విధంగా పూర్తి బాటిళ్లను విక్రయిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.అక్రమ విక్రయాలపై గతంలో పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో సమగ్ర తనిఖీలు జరగలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

మరో కోణంలో చీటీ వ్యాపారం...

మద్యం వ్యాపారంతో పాటు భారీ స్థాయిలో చీటీ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారనే ప్రచారం కారేపల్లి ప్రాంతంలో సాగుతోంది.సుమారు రూ.15 లక్షలకు పైగా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. దీనిపై అధికారులు విచారణ చేపట్టి, అవసరమైన అనుమతులు లేకుండా చీటీ వ్యాపారం నిర్వహిస్తున్నారా అనే అంశాన్ని పరిశీలించాలని స్థానికులు పలువురు అధికారులను కోరుకుంటున్నారు.

కల్తీ మద్యం కేసులో హోంగార్డును తప్పించారా?

ఇటీవల వెలుగులోకి వచ్చిన కల్తీ మద్యం వ్యవహారం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. శ్రీ కనకదుర్గ వైన్స్‌కు సంబంధించిన వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులు కొన్ని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే కేసు నమోదు విషయంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంటి యజమాని పోలీసు శాఖలో హోంగార్డుగా పనిచేస్తుండగా, ఆయనపై కాకుండా కుటుంబ సభ్యురాలిపై కేసు నమోదు చేయడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.కల్తీ మద్యం అనుమానాలను గుర్తించిన వెంటనే చర్యలు తీసుకోకుండా, ఒక రోజు ఆలస్యంగా కేసు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుండటంతో సంబంధిత శాఖ అధికారులు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తుంది.

కల్తీ మద్యం తయారీ ఆరోపణలు

వైన్‌షాప్ నిర్వహణకు సంబంధించి మరో కీలక ఆరోపణ కూడా స్థానికంగా చర్చకు దారితీస్తోంది. మద్యాన్ని కల్తీ చేసే నైపుణ్యం ఉన్న వ్యక్తిని ప్రత్యేకంగా నియమించుకున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలో ఖరీదైన బ్రాండ్ల మద్యంతో చౌక మద్యం కలిపి విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

హోంగార్డుపై అధికారుల మౌనం ఎందుకు?

సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు, దిశపత్రికలో వరుస కథనాలు ప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానాల నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్నతాధికారులు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.విషయాన్ని ఖండించకపోవడం అలాగే స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో ప్రజలలో పోలీస్ శాఖపై నమ్మకం పోతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

హోంగార్డుపై చర్యలు తీసుకోవాలి: స్థానికులు డిమాండ్

హోంగార్డు పాత్ర, వైన్‌షాప్ నిర్వహణ, కల్తీ మద్యం ఆరోపణలు, బెల్ట్‌షాపుల వ్యవహారం, చీటీ వ్యాపారం, అలాగే ఎక్సైజ్ శాఖ అధికారులను బెదిరించారనే ఆరోపణలపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, హోంగార్డుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story