45 ఏళ్లలో ఇదే మొదటిసారి.. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలపై షాకింగ్ గణాంకాలు

by Prasad Jukanti |

దేశీయ రియల్ ఎస్టేట్ రగంలో విభిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు లగ్జరీ ఇళ్ల విక్రయాలు పెరుగుతుంటే మరో వైపు పేద, మధ్యతరగతి ఇళ్ల మార్కెట్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్తోంది.

45 ఏళ్లలో ఇదే మొదటిసారి.. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలపై షాకింగ్ గణాంకాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక కల. ఈ కలను సాకారం చేసుకునేందుకు ఎంతో శ్రమిస్తుంటారు. కొన్ని సార్లు చేతి దగ్గరకు వచ్చినట్లే వచ్చి ఏదో అడ్డంకి చేత దూరం అవుతూ ఉంటుంది. ధనికులు, ఎగువ మధ్యతరగతి ప్రజలు తమ ఇంటికలను ఎలాగోలో సాకారం చేసుకునే వెసులుబాటు ఉన్నా ప్రస్తుతం భారత దేశ రియల్ ఎస్టేట్ రంగంలో కనిపిస్తున్న ట్రెండ్ పేద, మధ్యతరగతి ప్రజల విషయంలో ఆందోళన కలిగిస్తోంది. దేశ రియల్ ఎస్టేట్ సెక్టార్‍లో మిగిలిన విభాగాలు లాభాలతో దూసుకుపోతున్నప్పటికీ.. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో లభించే ఇళ్ల అఫార్డబుల్ (Affordable Housing) సెగ్మెంట్ మాత్రం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇది గత 45 ఏళ్లలో ఎన్నడూ చూడని సంక్షోభం అని ఈ రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తుండటంతో పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం అవుతోంది.

నాలుగు దశాబ్దాల కెరీర్‍లో ఇదే మొదటిసారి!

తాజాగా 'ది నేహా నగర్ షో' లో పాల్గొన్న హీరానందని గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ నిరంజన్ హీరానందని షాకింగ్ విషాలు వెల్లడించారు. గత రెండేళ్లలో అఫార్డబుల్ (Affordable Housing) విభాగం ఏకంగా 20 శాతం క్షీణించిందని చెప్పారు. తాను గత 45 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని వ్యాపారంలో హెచ్చుతగ్గులు సహజం అన్నారు. కానీ గత 30 ఏళ్ల గ్రాఫ్ చూస్తే ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ మార్కెట్ గ్రాఫ్ ఎప్పుడూ పైకే చూపించింది. కానీ నా 45 సుదీర్ఘ అనుభవంలో పిరమిడ్ దిగువ భాగం (అట్టడుగు వర్గాల మార్కెట్) పెరగకపోగా ఇలా 20 శాతం పడిపోవడం నేను చూడటం ఇదే మొదటిసారి అన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం అని ఆందోళన వ్యక్తం చేశారు.

లగ్జరీ, మిడ్-ప్రీమియం విభాగాల్లో వృద్ధి:

కరోనా మహమ్మారి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాస్‍ల వల్ల ఇండ్లకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. దీనివల్ల దాదాపు మూడేళ్లపాటు గృహాల విక్రయాలు 10-15 శాతం వృద్ధి చెందాయని, హోమ్ లోన్లు కూడా 15 శాతం పెరిగినట్లు తెలిపారు. అయితే ఈ వృద్ధి కేవలం లగ్జరీ, మిడ్-ప్రీమియం విభాగాలకే పరిమితమైందని, అఫార్డబుల్ హౌసింగ్ మాత్రం రివర్స్ గేర్‌లో వెళ్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం, ప్రైవేట్ రంగాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ సెగ్మెంట్ పుంజుకోలేకపోయింది. ప్రత్యేక పాలసీలు, రాయితీలు ఇస్తే తప్ప ఈ సమస్య సర్దుమణిగేలా లేదన్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పోల్చలేమన్న ఆయన.. మొత్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ బలంగానే ఉన్నప్పటికీ అందుబాటు ధరల గృహాల విభాగంపై మాత్రం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Next Story