పరిశ్రమల ‘వ్యర్థాలతో రంగుమారిన ‘లక్కారం’ చెరువు

by Malleboina Mahesh |

ఓ వైపు వర్షాలతో చెరువులు నిండుకుండల్లా మారితే.. ఇదే అదనుగా ఫార్మా కంపెనీలు ‘విషాన్ని’ కక్కుతున్నాయి.

పరిశ్రమల ‘వ్యర్థాలతో రంగుమారిన ‘లక్కారం’ చెరువు
X

దిశ, చౌటుప్పల్: ఓ వైపు వర్షాలతో చెరువులు నిండుకుండల్లా మారితే.. ఇదే అదనుగా ఫార్మా కంపెనీలు ‘విషాన్ని’ కక్కుతున్నాయి. ప్రజల ఆరోగ్యం, నిబంధనలను పట్టించుకోకుండా తమ వ్యర్థ జలాలను చెరువుల్లో వదిలి.. నీటిని కలుషితం చేస్తున్నాయి. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో లక్కారం చెరువును ఫార్మా కంపెనీలు పూర్తిగా కలుషితం చేయగా.. నీళ్లన్నీ రంగు మారాయి. దీనిపై ఫిర్యాదు చేసినా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోకపోవడం పై విమర్శలు వస్తున్నాయి.

రంగు మారిన నీళ్లు.. కాళ్లకు మంటలు

చౌటుప్పల్ మండలంలో వివిధ ఫార్మా పరిశ్రమల ఏర్పాటుతో భూమి, గాలి, నీరు పూర్తిగా కలుషితమయ్యాయి. ఇటీవల వర్షాలతో చౌటుప్పల్ పరిధిలోని లక్కారం చెరువు పూర్తిగా నిండి అలుగు పూసింది. అయితే లక్కారం చెరువు పై భాగంలో ఉన్న ఫార్మా పరిశ్రమలు.. చెరువులోకి వచ్చే కాలువల్లో లక్షలాది లీటర్ల ఫార్మా పరిశ్రమల వ్యర్థ జలాలను వదిలినట్టు చెరువు నీటిని పరిశీలిస్తే తెలుస్తున్నది. దీంతో లక్కారం చెరువు నీళ్లు నలుపు రంగులోకి మారాయి. ఇది గమనించిన స్థానికులు.. కొందరు చెరువు నీటిలోకి దిగగా.. కాళ్లకు మంటలు పుట్టాయి.

పత్తా లేని ‘పీసీబీ’

లక్కారం చెరువు నీళ్లు కలుషితం కావడంపై ఇటీవల కొందరు స్థానికులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫోన్ లో సమాచారం ఇచ్చారు. అయినా దీనిపై ఎవరూ స్పందించలేదు. ఆ తర్వాత కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రెటరీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఎంక్వయిరీలో పీసీబీ అధికారులు తాత్సారం చేస్తుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మా పరిశ్రమలపై ఫిర్యాదులు అందినప్పుడు విచారణ పేరుతో కాలయాపన చేయడం తప్పా.. పీసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు అనేకం ఉన్నాయి. వెంటనే లక్కారం చెరువు నీటి శాంపిల్ సేకరించి.. నిబంధనకు విరుద్ధంగా వ్యర్థ జలాలను విడుదల చేసిన ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

క్రిటికల్ పొల్యూటెడ్ ఏరియాగా పలు గ్రామాలు

నల్లగొండ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం పరిధిలో చౌటుప్పల్ ఉన్నది. ఫార్మా వ్యర్థాలతో ఇప్పటికే మండల పరిధిలోని అనేక గ్రామాలు ‘క్రిటికల్ పొల్యూటెడ్ ఏరియాలు’గా మారాయి. భూగర్భ జలాలు కలుషితం కావడంతో పంటలు పండక, పెట్టిన పెట్టుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్నామని అన్నదాతలు చెబుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలికి ఎన్ని ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తప్పని పరిస్థితుల్లో రైతులు జాతీయ హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేసినా.. పీసీబీ అధికారులు పరిశ్రమ యాజమాన్యాలకు అనుకూలంగా ఎన్జీటీకి నివేదికలు ఇవ్వడంతో.. ఆ కేసులు నీరుగారిపోతున్నట్టు తెలుస్తున్నది.

స్థానిక పరిశ్రమలతోనే కలుషితం

మా గ్రామానికి అతి సమీపంలో ఉన్న పలు ఫార్మా పరిశ్రమల వల్లే చెరువుల్లో నీటితోపాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఇష్టానుసారంగా వ్యర్థ జలాలను విడుదల చేయడంతోనే లక్కారం చెరువు రంగుమారింది. పీసీబీ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా.. కోర్టుల్లో కేసులు వేసినా.. చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.:-లావణ్య మల్లేశ్, మాజీ సర్పంచ్, ధర్మాజీగూడెం,

Next Story