- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పైసలు పాయె.. పదవీ దక్కకపాయ.. ఓడిన అభ్యర్థుల ఆవేదన

*ఎన్నికల్లో ఓడిన అభ్యర్థుల ఆవేదన
*ఓటమి భారానికి తోడైన అప్పుల బాధ
*ఫలితం తేడా రావడంతో అగమ్యగోచరం
*మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ధీమాతో కోట్లకు పైగా ఖర్చు..
సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచి ఓటమి చవిచూసిన అభ్యర్థుల పరిస్థితి ప్రస్తుతం వర్ణనాతీతంగా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులకు పోటాపోటీగా కోట్లాది రూపాయలు వెచ్చించిన అభ్యర్థులు, ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రిజర్వేషన్లు కలిసి వచ్చాయన్న మోజుతో ఆస్తులు అమ్మి, భూములు తాకట్టు పెట్టి మరీ ఎన్నికల్లో ఖర్చు చేసిన వీరికి, తీరా ఫలితం ప్రతికూలంగా రావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. చేసిన అప్పులకు నెలనెలా వడ్డీలు కట్టలేక, అసలు తీర్చే దారి లేక లోలోపల కుమిలిపోతున్నారు. ఎన్నికల సమయంలో అండగా ఉంటామని నమ్మించిన సొంత పార్టీ ముఖ్య నేతలు కూడా ఇప్పుడు కనీసం ఓదార్చడానికి రాకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనని అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని చూస్తుంటే సామాన్యుడు రాజకీయాల్లో నెట్టుకురావడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.- దిశ, సూర్యాపేట
దిశ, సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల అనంతరం ఓటమి చెందిన అభ్యర్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గెలిస్తే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందన్న ఆశతో పోటీ చేసిన అభ్యర్థులకు ఇప్పుడు అప్పుల భారం పెనుభారంగా మారింది. ఎన్నికలవేళ గెలుపుపై ధీమాతో ప్రత్యర్థులకు పోటాపోటీగా ఒక్కో అభ్యర్థి రూ.30లక్షల నుంచి ఏకంగా రూ.2కోట్ల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. తీరా ఓటమి చవిచూశాక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారు. కనీసం సొంత పార్టీ ముఖ్య నేతలు కూడా తమను పలకరించకపోవడంతో ఒంటరైపోయిన అభ్యర్థులు లోలోపల కుమిలిపోతున్నారు.
ఆస్తులు అమ్మి.. అప్పులు తెచ్చి..
రాజకీయ ఎదుగుదలకు కౌన్సిలర్ పదవి తొలిమెట్టు అని భావించిన కార్యకర్తలు, రిజర్వేషన్లు కలిసి రావడంతో ఉత్సాహంగా బరిలోకి దిగారు. ఓటర్లను ఆకర్షించేందుకు విందులు, వినోదాలు, ఖరీదైన బహుమతులతోపాటు ఓటుకు రూ.1,000 నుంచి రూ.10వేల వరకు పంపిణీ చేశారు. ఇందుకోసం కొందరు తమకున్న స్థిరాస్తులు విక్రయించగా, మరికొందరు వ్యవసాయ భూములను తాకట్టు పెట్టి లక్షలాది రూపాయలు తెచ్చి ఖర్చు చేశారు. నామినేషన్ వేసిన నాటి నుంచి ఫలితాల వరకు చేసిన ఖర్చు ఇప్పుడు వారిని అప్పుల ఊబిలోకి నెట్టింది. ఎన్నికల సమయంలో వెనకడుగు వేయకుండా తెచ్చిన అప్పులకు నెలనెలా వడ్డీలు కట్టడం ఇప్పుడు పెను సవాలుగా మారింది.
నిలువునా ముంచిన సన్నిహితుల ఒత్తిడి..
నిజానికి కొంతమందికి పోటీ చేసే ఆసక్తి లేకున్నా, పార్టీలు, సన్నిహితుల ఒత్తిడి మేరకు చివరి నిమిషంలో రంగంలోకి దిగారు. తీరా ఫలితాలు తారుమారు కావడంతో అటు గెలవలేక, ఇటు అప్పులు కట్టలేక వారి పరిస్థితి ‘రెంటికి చెడ్డ రేవడి’లా మారింది. పేదోడు రాజకీయాల్లో ఉండడం కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు ఇప్పుడు అక్షర సత్యమవుతున్నాయి. అప్పుల బాధ నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక, ఆదుకునే వారు లేక ఉమ్మడి జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో ఓటమి చెందిన అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.






