- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రింగ్ రోడ్డు కాంట్రాక్టర్‌తో ఆ పార్టీ నేతలకు కుదిరిన డీల్..!
పాలక ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్లో ఎక్కడైనా అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటే వాటిని గుర్తించి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది.

దిశ, నల్లగొండ బ్యూరో : పాలక ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్లో ఎక్కడైనా అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటే వాటిని గుర్తించి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది. తద్వారా ప్రజాసొమ్ము దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అయ్యేలా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలి. కానీ అదే ప్రతిపక్షాలు పాలక పక్షం, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కాసులకు కక్కుర్తి పడి ప్రజా సొమ్మును గద్దల్లా మింగేస్తున్నారనే విమర్శలు జిల్లాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పాలకపక్షం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పాటు నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ఒక్కసారిగా స్పందించే ప్రతిపక్షాలు, జిల్లా కేంద్రంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న వందల కోట్ల అవినీతి పై ఎందుకు స్పందించట్లేదనే ప్రశ్న ప్రజలను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లతో ఆ ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయనే చర్చకు బలం చేకూరుతున్నట్లు సమాచారం.
ఆ పార్టీల నేతలకు రూ. 2 కోట్లు...?
రూ. 516 కోట్ల రోడ్డు నిర్మాణ పనుల్లో అవకతవకలను ప్రశ్నించకుండా ఉండేందుకు ఆ ప్రతిపక్ష పార్టీల నేతలకు రూ. 2 కోట్లు ముడుపులు ముట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. అందులో ఓ ప్రతిపక్ష పార్టీ నేతలకు చిట్యాల సమీపంలోని ఓ హోటల్‌లో సుమారు రూ. 1 కోటి అందించగా, మరో పార్టీకి చెందిన నేతలకు హైదరాబాద్ సమీపంలోని లక్ష్మారెడ్డి పాలెంలోని ఓ గెస్ట్ హౌస్‌లో రూ. 1 కోటి అందించినట్లు సమాచారం. అయితే, ఓ పార్టీలో ఇద్దరు బడా నేతలు జిల్లా అధ్యక్షుడిని డమ్మీగా చేసి తమ ఇష్టారీతిలో వ్యవహరిస్తూ లోపాయికారి ఒప్పందంతో వచ్చిన అక్రమ సొమ్మును పంచుకున్నారని సమాచారం. డబ్బుల పంపిణీ సందర్భంగా పాల్గొన్న నేతల వివరాలు ఆడియో, వీడియో రూపంలో ఉన్నాయని, త్వరలో అవి వైరల్ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.
ప్రశ్నించిన యువకులపై పోలీసుల కేసులు...?
రింగ్ రోడ్డు నిర్మాణం కోసం అక్రమంగా రూ. 100 కోట్లు విలువైన చెరువు మట్టిని తరలిస్తున్న కాంట్రాక్టర్‌ను అడ్డుకున్నందుకు బుద్ధారం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులపై బ్లాక్‌మైలింగ్ ముద్ర వేసి అక్రమ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, వారిని డిటిసికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న పార్టీ కార్యకర్తలను కాంట్రాక్టర్‌తో కుమ్మక్కైన నాయకులు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ సెటిల్మెంట్ వ్యవహారంపై ఆ పార్టీ హైకమాండ్‌కు కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.
అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు ఈ స్థాయిలో బెదిరింపులు, సెటిల్మెంట్లు కొనసాగుతుంటే భవిష్యత్తులో మరిన్ని దారుణాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రజలు, యువత ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసేది ఎవరు, ఎప్పుడు వేస్తారు, లూటీ అవుతున్న ప్రజాధనాన్ని కాపాడేది ఎవరు అనే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి.






