అరుపులు.. తోపులాటలు.. ఉద్రిక్తతల మధ్య వాయిదా పడ్డ కాంగ్రెస్ సమావేశం

by Bhanu |

శుక్రవారం జరగాల్సిన జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశం ఉద్రిక్తతల మధ్య ప్రారంభం కాకుండానే వాయిదా పడింది.

అరుపులు.. తోపులాటలు.. ఉద్రిక్తతల మధ్య వాయిదా పడ్డ కాంగ్రెస్ సమావేశం
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): శుక్రవారం జరగాల్సిన జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశం ఉద్రిక్తతల మధ్య ప్రారంభం కాకుండానే వాయిదా పడింది. పార్టీలోని రెండు వర్గాలు ఆధిపత్య పోరుకు పాల్పడి సమావేశాన్ని గందరగోళంగా మార్చేశాయి.చివరికి అరుపులు,కేకలు, తోపులాటలు,తదితర వాటి మధ్య సమావేశం రణరంగంగా మారింది.ఒక దశలో అక్కడ ఏం జరుగుతుందో...? తెలియని పరిస్థితి ఏర్పడింది.ఈ పరిణామంతో పార్టీ క్యాడర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.చాలా కాలం తర్వాత అధికారంలోకి వస్తే ఏంటి...? ఈ పరిణామాలు అంటూ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.వివరాలు ఇలా ఉన్నాయి. మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం శుక్రవారం అర్వపల్లిలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఏర్పాటయింది.దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యుడు మందుల సామేల్,టీపీసీసీ పరిశీలకులు,మహబూబాబాద్ శాసనసభ్యుడు మురళీ నాయక్, శత్రు రావు,పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ హాజరు కావాల్సి ఉంది.

అయితే పార్టీలో ఉన్న రెండు వర్గాలు పోటాపోటీగా జనసమీకరణ చేశాయి.దీంతో సమావేశ ప్రాంగణం క్యాడర్ తో కిక్కిరిసిపోయింది. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తోపులాటలకు దారి తీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అడిషనల్ ఎస్పీ ఎం. నాగేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. అయితే ఈ ఉద్రిక్తతలు ఒకానొక దశలో జనగాం- సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించే వరకు దారితీయడాన్ని చూసిన ప్రయాణికులు ఏంటిది.. కాంగ్రెస్ సమావేశమా.. వాళ్ళు అంతేలే..అని పెదవి విరవడం గమనార్హం. సమావేశానికి హాజరైన కొందరు కార్యకర్తలు 10 ఏళ్ళ తర్వాత వచ్చిన అధికారాన్ని అనుభవించకుండా ఈ గొడవలు ఎన్నడు సద్దుమణుగతయో ఏమో అని మాట్లాడుకోవడం కనిపించింది. కొంత సమయం తర్వాత, ఒక వర్గానికి చెందిన వారు మాత్రం పదవుల కోసం పోటీలు పడే ఆశావాదుల నుండి దరఖాస్తులను తీసుకున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే సమావేశానికి రావాల్సిన పార్టీ అతిథులు రాకపోవడం గమనార్హం. కాగా పరిస్థితులన్నీ జిల్లా కాంగ్రెస్ పార్టీ దృష్టికి వెళ్ళినట్లు తెలిసింది.




Next Story