వృత్తి, విద్య నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

by velandi.Saikiran |

విద్యార్థులు వృత్తి, విద్య నైపుణ్యాలను పెంపొందించుకోవాలని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ కిషోర్ రెడ్డి

వృత్తి, విద్య నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
X

దిశ, భూదాన్ పోచంపల్లి: విద్యార్థులు వృత్తి, విద్య నైపుణ్యాలను పెంపొందించుకోవాలని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ కిషోర్ రెడ్డి అన్నారు. ఆదివారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పూర్ గ్రామంలో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో అంబేద్కర్ యూనివర్సిటీ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా పిసి ఆచార్య గంటా చక్రపాణి, ఎస్ ఆర్ టి ఆర్ ఐ చైర్మన్ కిషోర్ రెడ్డి సమక్షంలో యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ విజయ కృష్ణారెడ్డి, సంస్థ డైరెక్టర్ హరికృష్ణ లు అవగాహన ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు.

అనంతరం ఉపకులపతి ఆచార్య గంటా చక్రపాణి మాట్లాడుతూ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా అందించే వృత్తి విద్య కోర్సులను అంబేద్కర్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు అందించేలా ఈ ఒప్పందం జరిగిందని, దీంతో విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలు, పరిశ్రమ ఆధారిత శిక్షణ పొందుతారని ,కోర్సు పూర్తి కాగానే ఉద్యోగ అవకాశాలతో పాటు స్వయ ఉపాధి పొందవచ్చని తెలిపారు.

విద్యార్థి దశలోనే ఉపాధి కల్పించేలా పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఎస్ ఆర్ టి ఆర్ ఐ చైర్మన్ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తో కలిసి ఉపాధి కోర్సులను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ పుష్ప చక్రపాణి; స్కిల్ డెవలప్మెంట్, ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కో-ఆర్డినేటర్ పల్లవీ, ఈ.ఎం.ఆర్.ఆర్.సి. డైరెక్టర్ రవీంద్రనాథ్ సోలమన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story