గుట్ట మట్టి దందాకు..అధికారుల అండ..!

by velandi.Saikiran |

జిల్లా కేంద్రంలోనే ఉన్న మట్టిదోపిడి కనిపించక.... చర్లపల్లి సమీపంలో పానగల్ చెరువు బఫర్ జోన్ లో కాలేజీ నిర్మాణం చేస్తే

గుట్ట మట్టి దందాకు..అధికారుల అండ..!
X

దిశ నల్లగొండ బ్యూరో: ""చుట్టూ శాఖాహారులే..... కానీ కోడి పిల్ల మాయమయింది..."" అన్న చందంగా ఉంది అక్కడ మట్టి తవ్వకం... ఆ గుట్ట కు కూత వేటు దూరంలో జిల్లా యంత్రాంగం, డివిజన్, మండల అధికార యంత్రాంగం కొలువుదీరి ఉంది. కానీ వందల ఎకరాలు విస్తీర్ణం కలిగిన ఆ గుట్ట నుంచి మట్టి తోవ్వుతూ పెద్ద ఎత్తున దందా జరుగుతున్నా... ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

నల్లగొండ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో 33/స నెంబర్ లో 136 ఎకరాల విస్తీర్ణంలో గుట్టతో కూడిన ప్రభుత్వ భూమి ఉంది . అందులోనే అన్నేశ్వరమ్మ గుట్ట ఉంది. ఇక్కడే ఉన్న దేవాలయంలో దాదాపు నిత్యము పూజలు కూడా జరుగుతుంటాయి. ఈ గుట్ట పైన నల్గొండ పట్టణముతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటి వసతి అందించిన రెండు మేజర్ వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఈ గుట్ట పైన చెట్లు రాళ్లు కాకుండా దాదాపు విలువైన ఖనిజ సంపద కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే..

---గుట్ట తవ్వేస్తున్నా....

జిల్లా కలెక్టరేట్ కు సరిగ్గా 5 కిలోమీటర్ల దూరంలో ఎంతో విలువైన ఖనిజ సంపద కలిగిన గుట్ట భూమి ఉంది.. ఆ గుట్టకు సంబంధించిన భూమిని కొంతమంది మట్టి వ్యాపారులు రోజు సుమారు 100ట్రాక్టర్ల మట్టి తోడేస్తున్నారని సమాచారం . ప్రధానంగా రాత్రి వేళల్లో నే ఈ దందా జరుగుతుందని తెలుస్తోంది. దీంతో లక్షలాది రూపాయల ఆదాయాన్ని పోగేసుకుంటున్నారు.. ప్రైవేటు బిల్డర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రోడ్డు కాంట్రాక్టర్లకు, ఈ భూమిని కొంత మంది మట్టి దోపిడీ ముఠా విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఎక్కడైనా మట్టి అమ్మడానికి గిరాకి రాకపోతే పానగల్ నుంచి కట్టంగూరు కు వెళ్లే దారిలో వందలాది టిప్పర్ల మట్టి కుప్పలు పోసి నిల్వ పెడుతున్నారు. నిత్యం ఆ దారిలో వెళ్లే అధికారులు అందరికీ ఈ మట్టి కుప్పలు కనిపిస్తుంటాయి.. కానీ కలెక్టర్ నుంచి మండల రెవెన్యూ అధికారి వరకు ఏ ఒక్కరు కూడా ఈ మట్టి ఎక్కడి నుంచి వస్తుంది.... ఎక్కడికి వెళ్తుంది.. అని విచారణ చేసిన సందర్భం లేకపోవడం ఆశ్చర్యం.

--- అధికారులకు కనిపించట్లేదా....??

జిల్లా ప్రభుత్వ కార్యాలయాలకు కూత వేటు దూరంలో మట్టి దోపిడీతో పాటు గా కనిజ సంపదను దోపిడీ చేస్తుంటే అధికారులకు కనిపించట్లేదంటే నమ్మశక్యంగా లేదు. అయితే ఈ మట్టి దందా వ్యాపారం చేసే వాళ్లకి జిల్లా కేంద్రంలో ఉండే ముఖ్యమైన రెవెన్యూ అధికారులు అండదండలు పూర్తిస్థాయిలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే నిజం కాకపోతే రెండేళ్లకు పైగా ఈ దందా జరుగుతుంటే ఎందుకు దోపిడి ధరలపై చర్యలు తీసుకోవడం లేదని అనుమానాలు వినిపిస్తున్నాయి. మట్టి వ్యాపారుల నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన రెవెన్యూ అధికారులకు నెలవారి మామూలు లక్షల్లో ముడుతున్నట్లు తెలుస్తోంది. "" మట్టి తవ్వకం పై మైనింగ్ అధికారులను ప్రశ్నిస్తే రెవెన్యూ అధికారులు సర్వే చేసి ప్రభుత్వ భూమికి హద్దులు నాటితే ఆ గుట్టను తవ్వే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు...""" కానీ రెవెన్యూ అధికారులు సర్వే చేయడానికి ఎందుకు సంతోషిస్తున్నారో అర్థం కావట్లేదు.. సర్వే చేసి హద్దులు నాటితే వచ్చే మామూళ్ల రూపంలో వచ్చే నోట్ల కట్టలు ఆగిపోతాయని ఆందోళనలో రెవెన్యూ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లా కేంద్రంలోనే ఉన్న మట్టిదోపిడి కనిపించక.... చర్లపల్లి సమీపంలో పానగల్ చెరువు బఫర్ జోన్ లో కాలేజీ నిర్మాణం చేస్తే అధికారులకు స్పందన లేదు... నర్సింగ్ బట్లలో చెరువు కబ్జా చేసి పంట చేను వేస్తే అధికారులకు పట్టింపు లేకపాయే.. ఇవే కాదు ఇంకా అనేక అక్రమాలు జరుగుతున్న రెవెన్యూ అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరం.

నీళ్ల ట్యాంకులకు ప్రమాదం...?

అమ్మేశ్వరమ్మ గుట్టపై నిర్మాణం చేసిన నీళ్ల ట్యాంకులు నల్గొండ మున్సిపాలిటీ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటిని అందించనున్నాయి. అయితే ఈ ట్యాంకుల చుట్టుపక్కల మట్టితోవ్వడం వల్ల అవి కూలిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అవే కూలిపోతే వేలాది కుటుంబాలకు నీటి సరఫరా ఆగిపోయి ప్రమాదం ఉంది. ఒకవేళ అదే జరిగితే తీవ్రమైన తాగునీటి కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని అనేకమంది ప్రజాసంఘాల నాయకులు లిఖితపూర్వకంగా జిల్లా యంత్రాంగానికి అందజేసిన కనీసం అటువైపు వెళ్లి వాస్తవ వాస్తవాలను విచారించే పరిస్థితి కూడా లేకపోయింది. అంటే ప్రజా సమస్యల పట్ల అధికారులకు ఎంత చిత్తశుద్ధి ఉందో వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నామని చెప్పే అధికార యంత్రాంగం ప్రభుత్వ సంపాదన కొల్లగొట్టడం ప్రజా సమస్య కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Next Story