ఆర్టీఓ కార్యాలయం @ అవినీతిమయం... పైసలియ్యకుంటే ఫైల్ పక్కకే..

by Dishanational1 |
ఆర్టీఓ కార్యాలయం @ అవినీతిమయం... పైసలియ్యకుంటే ఫైల్ పక్కకే..
X

దిశ, నిఘా బ్యూరో: నల్లగొండ నియోజకవర్గానికి చెందిన రాము(పేరు మార్చాం) అనే వాహనదారుడు ఇటీవల సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశారు. సదరు వాహనాన్ని పాత యాజమాని పేరు నుంచి తన పేరు మీదకు మార్చుకునేందుకు ఆర్టీఓ కార్యాలయానికి వచ్చాడు. అయితే సదరు యువకుడు ఉన్నతవిద్యను అభ్యసించి.. సమాజం పట్ల కొంత అవగాహన ఉండడంతో నేరుగా ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి వెహికల్ ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది ఈ పేపర్ లేదు.. ఆ పేపర్ లేదు.. అక్కడ సైన్ కావాలి.. ఇక్కడ సైన్ కావాలంటూ వారం రోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినంత పనిచేశారు. విసిగిపోయిన సదరు యువకుడు ఓ ఏజంట్‌ను కలిసి రూ.2500 ముట్టజెప్పడంతో రెండు రోజుల్లోనే పని పూర్తయ్యింది. ఇదీ ఒక్క రాము పరిస్థితే కాదు.. నల్లగొండ కార్యాలయానికి వచ్చే సగటు వాహనదారుడి పరిస్థితి ఇదే.

అది నల్లగొండ రవాణ శాఖ కార్యాలయం. పైగా పక్కనే జిల్లా కలెక్టరేట్.. అక్కడ పారదర్శకంగా సేవలు అందాలి. కానీ పైసలియ్యకుంటే.. ఫైల్ కదిలేదే లేదు. లైసెన్స్, ఆర్సీ, వెహికల్ ట్రాన్స్‌ఫర్.. ఇలా ఏ పని జరగాలన్నా.. ఆర్టీఓ ఏజంట్ దగ్గరి నుంచి పైఅధికారి వరకు ముట్టజెప్పాల్సిందేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి వాహనదారుడు లైసెన్స్ నేరుగా స్లాట్ బుక్ చేసుకుని తీసుకుంటే.. రూ.1200 మించి ఖర్చు కాబోదు. కానీ నల్లగొండ ఆర్టీఓ కార్యాలయంలో అవన్నీ చెల్లవు. ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకున్నా.. నేరుగా కార్యాలయానికి వెళ్లి చెప్పులు అరిగేలా తిరిగినా.. లైసెన్స్ వచ్చేది ఉండదు. పని కంప్లీట్ అయ్యేది లేదు. ఇంత జరుగుతున్నా.. ఉన్నతాధికారులు మాత్రం మౌనం వహిస్తుండడం గమనార్హం.

ప్రతి పనికీ ఓ రేటు..

నల్లగొండ ఆర్టీఓ కార్యాలయం.. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. లైసెన్స్ జారీ నుంచి స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ వరకు ఏ పని జరగాలన్నా.. రూ. వేలకు వేలు ముట్టజెప్పాల్సిందే. లేకుంటే రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, ఏజంట్లు కుమ్మక్కై.. వాహనదారులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా సేవలు అందాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. కానీ అధికారులు ఈ విషయాన్ని అసలు మార్చేపోయారు. ఏజంటు ద్వారా ఫైల్ వస్తే తప్ప.. అక్కడ పని జరిగే పరిస్థితి ఉండదంటే.. ఎంత దారుణమో అర్థం చేసుకోవాలి.

కవర్ లేకుంటే రిజక్ట్..

వాహనదారుల నుంచి సంబంధిత వాహన పత్రాలతో దరఖాస్తు చేసి వాటిని అఫ్రూవల్ చేయించడంలో ఏజంట్లదే కీలక పాత్ర. అయితే ఇందులో లైసెన్స్, ఆర్సీ, వెహికల్ ట్రాన్స్‌ఫర్, ఫిట్‌నెస్ తదితర పనులకు ఒక్కో విధంగా రేటు ఉంటుంది. సంబంధిత దరఖాస్తుతో మనీ కవర్ లేకుంటే.. ఆ ఫైల్ రిజక్ట్ కావడం సర్వసాధారణం. అయితే ఆర్టీఓ కార్యాలయంలో జరిగే అవినీతికి వైట్ కవర్‌లో మనీ పెట్టి గుట్టుచప్పుడు కాకుండా అందించడంలో ఏజంట్లు ఆరితేరారనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నా.. ఏజంట్లను ఇంత పెద్దస్థాయిలో పెంచి పోషించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటనేది అంతుచిక్కని విషయమనే చెప్పాలి. ఆర్టీఓ కార్యాలయం ఎదుట పదుల సంఖ్యలో ఏజంట్లు బహిరంగంగా దుకాణాలు తెరిచి సేవలు అందిస్తుండడం.. వాహనదారుల కంటే అధికంగా ఏజంట్లే ఆర్టీఓ కార్యాలయంలోకి దర్జాగా వెళుతున్నా.. ఆర్టీఓ అధికారులకు చీమకుట్టినట్టు లేకపోవడం వెనుక అసలు కారణం అమ్యామ్యాలుగానే తెలుస్తోంది. ఆర్టీఓ కార్యాలయంలో జరిగే అవినీతిని ఎవరైనా ప్రశ్నిస్తే.. తమను డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారంటూ అధికారులు, సిబ్బంది ఎదురుదాడి చేస్తుండడం కొసమెరుపు.


Next Story