పడిపోయాయి సారు.... పట్టించుకోండి.!

by Naveena |

భూదాన్ పోచంపల్లి మండల పరిధి జలాల్ పురం గ్రామంలోని చెరువు కట్టపై సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది.

పడిపోయాయి సారు.... పట్టించుకోండి.!
X

దిశ,భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి మండల పరిధి జలాల్ పురం గ్రామంలోని చెరువు కట్టపై సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది. పోచంపల్లి నుంచి హైదరాబాద్ కు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో.. నిత్యం వందల సంఖ్యలో రాకపోకలు నిర్వహిస్తుంటారు. అసలే చిమ్మ చీకటి.. అందులో మూల మలుపు. ఇటీవల హైదరాబాదుకు చెందిన ఐదుగురు యువకులు మూల మలుపు కనిపించక అదుపుతప్పి కారు చెరువులోకి దూసుకెళ్లడంతో.. ఐదుగురు జల సమాధైన

విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు గ్రామస్తులు, అఖిలపక్ష నామకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడంతో.. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 20 లక్షల రూపాయలు మంజూరు చేశారు. కానీ నాటి నుండి నేటి వరకు పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు.

గతంలో ఈ దారి వెంట ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. అయితే ఇటీవల పోలీసు శాఖ ఆధ్వర్యంలో.. దాతల సహకారంతో చెరువు కట్టపై ప్రమాదాలను నివారించేందుకు భారీ కేడ్లు, బ్లింకింగ్ లైట్లను ఏర్పాటు చేశారు .అయితే పది రోజుల క్రితం ఈదురుగాలు లతో కురిసిన వర్షానికి అవి కూడా కింద పడటంతో.. సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది. తాత్కాలికంగా బారికేడ్లను ఏర్పాటు చేస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారం అయినట్టేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ దారి వెంట వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని,ఏదైనా ప్రాణ నష్టం జరిగితే తప్ప పట్టించుకోరా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసి శాశ్వతంగా సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

Next Story