- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలేరు మున్సిపాలిటీలో కార్మికుల విలవిల
లేరు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల దుస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. కార్మికుల సమస్యలు నిరంతరం పెరుగుతున్నాయి.

దిశ, ఆలేరు : ఆలేరు మున్సిపాలిటీలో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల దుస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. కార్మికుల సమస్యలు నిరంతరం పెరుగుతున్నా, మున్సిపల్ అధికారులకు మాత్రం వారి బాధలు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీలో వాస్తవంగా క్షేత్రస్థాయి (ఫీల్డ్)లో పనిచేసే సిబ్బంది సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన కొద్దిమంది కార్మికుల భుజాలపైనే పట్టణ శుభ్రత మొత్తం మోపడం ఎంతవరకు సమంజసమని కార్మిక సంఘాల నాయకులు మున్సిపల్ అధికారులను గట్టిగా ప్రశ్నిస్తున్నారు.
ఫీల్డ్‌లో 12 మంది మాత్రమే..
ఆలేరు మున్సిపాలిటీలో మొత్తం 42 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 22 మంది పురుషులు కాగా, మిగతా 20 మంది మహిళలు ఉన్నారు. అయితే 22 మంది పురుష కార్మికుల్లో ముగ్గురు వయోభారం కారణంగా పనులకు రావడం లేదు. మరో నలుగురు ఆటోలు, ట్రాక్టర్ల డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తుండగా, ఇంకో ముగ్గురు ఆఫీస్ పనులకే పరిమితమయ్యారు. దీంతో ఫీల్డ్‌లో పారిశుధ్య పనులకు అందుబాటులో ఉన్న పురుష కార్మికుల సంఖ్య కేవలం 12 మందికి చేరింది. ఆ 12 మందిలో కూడా అప్పుడప్పుడు ఇద్దరు అనారోగ్యంతో గైర్హాజరవుతుండడంతో మిగిలిన కొద్దిమందే కాలనీలు, వీధుల తుడవడం, చెత్త సేకరణ పనులన్నింటినీ చేయాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి మహిళా కార్మికుల పైన తీవ్ర ప్రభావం చూపుతోంది.
నియామకాల్లో జాప్యం..
మున్సిపాలిటీలో ఇంత తీవ్రమైన సిబ్బంది కొరత వేధిస్తున్నా కార్మికుల పని భారాన్ని తగ్గించేందుకు అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో మున్సిపల్ అధికారులు తీవ్ర జాప్యం వహిస్తుండడం గమనార్హం. పట్టణం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలని నిత్యం ఆదేశాలు జారీ చేసే అధికారులు, ఆ శుభ్రత కోసం రాత్రింబగళ్లు చెమటోడ్చే కార్మికుల ఆరోగ్యం, వారి పని పరిస్థితులను ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
అధికారుల నిర్లక్ష్యం..
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండనక, వాననక, తీవ్రమైన దుర్వాసనల మధ్య పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై మున్సిపాలిటీ అధికారులకు కనీస మానవీయ దృష్టి లేకపోవడం దారుణమని కార్మిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు తీవ్రమైన సిబ్బంది కొరత, మరోవైపు మోయలేని పని భారం, దానికి తోడు ఆరోగ్య సమస్యలతో కార్మికులు నలిగిపోతున్నారు. వీరి కష్టాన్ని చూసి కూడా స్పందించని మున్సిపాలిటీ అధికారుల వైఖరిపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి కొత్త కార్మికులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.






