సూర్యాపేట మున్సిపాలిటీలో ‘షాడో కింగ్’ హవా!

by Ajay Maddhiboyina |

సూర్యాపేట మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు లేకుండానే పనులు చేపడుతున్నారు. ఓ ‘షాడో కింగ్’ కనుసైగల్లోనే కార్యాలయం మొత్తం నడుస్తోందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. డివైడర్ల వద్ద పైపులు వేయడం, వాహనాల రిపేర్ పనులను నిబంధనలు లేకుండానే కేటాయిస్తున్నారు.

సూర్యాపేట మున్సిపాలిటీలో ‘షాడో కింగ్’ హవా!
X

సూర్యాపేట మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు లేకుండానే పనులు చేపడుతున్నారు. ఓ ‘షాడో కింగ్’ కనుసైగల్లోనే కార్యాలయం మొత్తం నడుస్తోందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. డివైడర్ల వద్ద పైపులు వేయడం, వాహనాల రిపేర్ పనులను నిబంధనలు లేకుండానే కేటాయిస్తున్నారు. స్ట్రీట్ లైట్ల కొనుగోలు విషయంలోనూ పారదర్శకత కరువైందని విమర్శలు వస్తున్నాయి. మురుగు నీటి పైపుల పనులను ముందుగా ప్రజాసేవగా చూపి, తర్వాత అక్రమంగా బిల్లులు పొందుతున్నారు. ఆన్లైన్ టెండర్ ప్రక్రియను పాటించకుండా బిల్లులు చెల్లించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ పనులపై విచారణ జరపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

- దిశ, సూర్యాపేట

దిశ, సూర్యాపేట : సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో ఓ వ్యక్తి ‘షాడో కింగ్’లా వ్యవహరిస్తూ తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడని, అతడికి తెలియకుండా ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలడం లేదని స్థానికులు, కాంట్రాక్టర్లు విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీలో పారదర్శకత కరువైందని, టెండర్ విధానాన్ని పూర్తిగా పక్కనబెట్టి నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టెండర్లకు తూట్లు.. ఇష్టారాజ్యంగా పనులు

పట్టణంలోని ప్రధాన జంక్షన్ల మధ్య ఉన్న డివైడర్లలో మొక్కలకు నీటి సదుపాయం కోసం పైపులు వేసే పనులను ఎలాంటి టెండర్ లేకుండానే చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక మున్సిపాలిటీ వాహనాల రిపేర్లు, ఆటోలు, జేసీబీలు, టైర్ల కొనుగోలు వంటి పనులను సైతం టెండర్ ప్రక్రియ లేకుండానే ఒక వ్యక్తికి అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. విలీన గ్రామాల్లో పవర్ బోర్ల నిర్వహణ, మెటీరియల్ కొనుగోలు విషయంలోనూ నిబంధనలు పాటించకుండా ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన దుకాణం ద్వారా లావాదేవీలు నడుపుతున్నట్టు సమాచారం. పైపుల లీకేజీ మరమ్మత్తుల కోసం అద్దె కార్మికులను తీసుకోవడం, మెటీరియల్‌ను ముందే కొనుగోలు చేయడం వంటి చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయి.

అంతా ఆయన కనుసైగలోనే!

స్ట్రీట్ లైట్లు, ఎల్ఈడీ బల్బుల కొనుగోలు ప్రక్రియ కూడా టెండర్ లేకుండానే జరిగి ఇప్పటికే మున్సిపాలిటీకి చేరినట్టు తెలుస్తోంది. ఖమ్మం రోడ్డులో మురుగు నీటి పారుదల కోసం పైపులు వేసి, ముందుగా ప్రజా సేవగా ప్రచారం చేసుకుని, ఆ తర్వాత రూ.3లక్షల బిల్లులు టెండర్ లేకుండానే చెల్లించుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా మున్సిపాలిటీలో ఏ పని చేపట్టాలన్నా ఆన్లైన్ టెండర్ పక్రియ తప్పనిసరి అయినప్పటికీ, ఇక్కడ మాత్రం పనులు ముగించి ఇష్టారాజ్యంగా బిల్లులు వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల వ్యక్తిగత ప్రయోజనాలకే మున్సిపాలిటీ ప్రాధాన్యత ఇస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.

నిబంధనల ప్రకారమే పనులు

మున్సిపాలిటీలో పనులన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి. కొన్ని వార్డుల్లో ప్రజల అత్యవసర అవసరాల దృష్ట్యా కొన్ని పనులు చేపడుతున్నాం. టెండర్ల ప్రకారమే ముందుకు వెళ్తున్నాం. పాత ఎల్ఈడీ లైట్లకు రిపేర్లు చేయిస్తున్నాం. కొత్త లైట్లు ఇంకా రావాల్సి ఉంది. మున్సిపాలిటీకి కావాల్సిన అన్ని రకాల మెటీరియల్స్‌ను టెండర్ విధానం ద్వారానే తెప్పించుకుంటున్నాం.

- మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి

Next Story