- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యాపేట జిల్లాకు ఆర్డిఆర్ ఎస్సారెస్పీ రెండో దశ జలాలు విడుదల
ఈ ఏడాది రబీ సీజన్ లో పంటల సాగు నిమిత్తం నీటిపారుదల శాఖ ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు రాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాంసాగర్ రెండో దశ (ఆర్డిఆర్ ఎస్సారెస్పీ) జలాలు వారబందీ పద్ధతిలో తాజాగా విడుదల చేశారు.

దిశ, తుంగతుర్తి : ఈ ఏడాది రబీ సీజన్ లో పంటల సాగు నిమిత్తం నీటిపారుదల శాఖ ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సూర్యాపేట జిల్లాకు రాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాంసాగర్ రెండో దశ (ఆర్డిఆర్ ఎస్సారెస్పీ) జలాలు వారబందీ పద్ధతిలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదలయ్యాయి.జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్,రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్నతో కలిసి గేట్లను ఎత్తడంతో ప్రధాన కాలువ ద్వారా నీళ్లు సూర్యాపేట జిల్లా వైపు పరుగులు పెట్టాయి.ఈ సందర్భంగా వెళుతున్న జలాల్లో పసుపు,కుంకుమ,పూలు వెదజల్లుతూ పూజలు చేశారు.విడుదలైన జలాలతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 13 వేల 175 ఎకరాలు సాగులోకి వస్తాయి.ఇందులో తుంగతుర్తి నియోజకవర్గం 94 వేల 291 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుతం బయన్నవారు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 0.480 టీఎంసీలకు గాను 0.327 నిల్వ ఉంది.ఈ మేరకు సూర్యాపేట జిల్లాకు 531 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పైనుండి అంటే మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి వచ్చే నీళ్లతో గురువారం నాటికి 1600 క్యూసెక్కులను పెంచుతామని డిఈ సత్యనారాయణ,ఏఈ చంద్రశేఖర్ లు "దిశ"కు తెలిపారు. కార్యక్రమంలో డీఈలు సునీత నవీన్ కుమార్,కృష్ణయ్య,ఏఈలు అఖిల్,హరిస్వరూప్ తో పాటు కొడకండ్ల మార్కెట్ చైర్మన్ అండాలు,సర్పంచ్ సతీష్ మమత పాల్గొన్నారు.
అత్యధికంగా తుంగతుర్తి మండలానికే లబ్ధి
బయన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా విడుదలైన జలాలు తుంగతుర్తి నియోజకవర్గం వెలిశాల వద్ద ఏర్పాటైన 69,70,71 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించాయి.ఈ మేరకు తిరుమలగిరి,తుంగతుర్తి,నూతనకల్,మద్దిరాల,నాగారం, జాజిరెడ్డిగూడెం మండలాల మీదుగా సూర్యాపేట జిల్లాలోకి గురువారం నాటికి నీళ్లు చేరుకోనున్నాయి. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎస్సారెస్పీ జలాలతో ఎక్కువగా లబ్ధి పొందే మండలం తుంగతుర్తి. మండలంలో 24 వేల 102 ఎకరాలు సాగులోకి వస్తుండగా అతి తక్కువగా తిరుమలగిరి మండలంలో 3 వేల 360 ఎకరాలు ఉంది.
మార్చి 30 వరకే నీటి విడుదల
బుధవారం సూర్యాపేట జిల్లాకు విడుదలైన జలాలు వారబందీ పద్ధతిలో (అంటే వారం విడిచి మరో వారం విడుదల) మార్చి 30 వరకు మాత్రమే విడుదల కానున్నాయి.అయితే తదుపరి పంటల పరిస్థితి,రైతుల డిమాండ్,నీటి నిలువల వంటివన్నీ ఉన్నతాధికారుల సమీక్ష తర్వాతనే తుది నిర్ణయం ఉంటుంది.






