‘నా కొడుకుని బతికించండి’.. ఓ కన్నతల్లి ఆవేదన!

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-15 15:19:16  IST  )

అంతుచిక్కని వ్యాధితో కాళ్లు చేతులు పడిపోయి నిమ్స్ ఆసుపత్రిలో ఓ బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

‘నా కొడుకుని బతికించండి’.. ఓ కన్నతల్లి ఆవేదన!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆ ఇంట పన్నెండేళ్ల క్రితమే తండ్రి నీడ కోల్పోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని చేనేత మగ్గంపై ఆ తల్లి పడే కష్టమే ఆ కుటుంబానికి జీవనాధారం. కొడుకే తన సర్వస్వంగా బతుకీడుస్తున్న ఆ తల్లిపై విధి మరోసారి పగబట్టింది. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన కన్నబిడ్డ అంతుచిక్కని వ్యాధితో మంచానపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే.. ఆ బిడ్డను చూసి ఆ కన్నతల్లి గుండె కరిగిపోతోంది. ‘అయ్యా నా కొడుకుని బతికించండి’ అంటూ కన్నీరుమున్నీరవుతూ దాతల సాయం కోసం ఆమె ఎదురుచూస్తోంది.

రూ.1.80 లక్షలు ఖర్చయినా తేలని జబ్బు!

యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం మండల పరిధిలోని పుట్టపాక గ్రామానికి చెందిన శివ అనే బాలుడు కొన్ని రోజుల క్రితం వరకు అందరిలానే ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ విధి ఆడిన వింత నాటకంలో.. అకస్మాత్తుగా ఆ బాలుడికి ఛాతి కింది భాగం నుంచి కాళ్ల వేళ్ల వరకు పక్షవాతం (Paralysis) వచ్చింది. దీంతో అతడు కదల్లేని స్థితికి చేరుకున్నాడు. మొదట నల్గొండలోని రివర్ నిమ్స్‌లో వైద్యం అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీఎస్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ సుమారు రూ. 1.80 లక్షలు ఖర్చు చేసినప్పటికీ, అసలు వ్యాధి రావడానికి గల కారణాన్ని వైద్యులు గుర్తించలేకపోయారు.

నిమ్స్‌లో పోరాటం.. చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితి

ప్రస్తుతం ఆ బాలుడు పంజాగుట్ట నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడ బాలుడికి ఇంకా పలు రకాల వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. 12 సంవత్సరాల క్రితమే భర్త చనిపోవడంతో, తల్లి చేనేత కార్మికురాలిగా రోజువారీ కూలీగా పనిచేస్తూ ఆ కుటుంబాన్ని సాకుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటంతో ఇప్పటివరకు ఇంట్లో దాచుకున్న పొదుపు మొత్తం చికిత్సకే ఖర్చయిపోయింది. చేతిలో పైసా లేక, కొడుకు ప్రాణం ఎప్పుడు ఏమౌతుందోనని ఆ తల్లి ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం వైద్య ఖర్చులు భరించలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ తల్లి ఆవేదనను చూసి స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, దాతలు మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అందించే చిన్న విరాళమైనా బాధితుడు శివ వైద్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.

Next Story