యూరియా కోసం 'సర్పంచ్'లకు తప్పని తిప్పలు..

by Kodari Anjali |

స్వయంగా అధికార పార్టీకి చెందిన ఒక సర్పంచే యూరియా బస్తా కోసం రోజుల తరబడి ఫోన్ పట్టుకొని యుద్ధం చేయాల్సి వస్తోంది.

యూరియా కోసం సర్పంచ్లకు తప్పని తిప్పలు..
X

దిశ, భూదాన్ ​పోచంపల్లి: సామాన్య రైతుల మాట దేవుడెరుగు.. స్వయంగా అధికార పార్టీకి చెందిన ఒక సర్పంచే యూరియా బస్తా కోసం రోజుల తరబడి ఫోన్ పట్టుకొని యుద్ధం చేయాల్సి వస్తోంది. అయినా యూరియా దొరక్కపోవడంతో విసుగు చెందిన సర్పంచ్, మండల వ్యవసాయ అధికారి (ఏఓ) కి ఫోన్ చేసి తీవ్రస్థాయిలో నిలదీశారు.​ ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని శివారెడ్డిగూడెం గ్రామ అధికారి పార్టీ సర్పంచ్ బొక్క మల్లారెడ్డి గత 15 రోజులు యూరియా బుకింగ్ చేసేందుకు ప్రయత్నించి బుక్ కాకపోవడంతో విసుగు చెంది మండల వ్యవసాయ అధికారి శైలజకు ఫోన్ చేసి నిలదీసిన ఆడియో చర్చనీయాంశంగా మారింది.

రైతుల చస్తేనే యూరియా దొరుకుతుందా..?

పొద్దున, సాయంత్రం అనే తేడా లేకుండా ఫోన్ పట్టుకొని కూర్చొని యూరియా కోసం కొడుతూనే ఉన్నాం. అయినా మాకు అవ్వడం లేదు. ప్రతిసారి ఫోన్ స్టక్ అయిపోతోంది. రైతులు చస్తేనే యూరియా దొరుకుతుందా ..? అంటూ సర్పంచ్ తన ఆవేదనను ఏఓతో వెళ్లగక్కారు. ఒక అధికార పార్టీ సర్పంచ్‌కే సిస్టమ్ ద్వారా యూరియా పొందే అవకాశం రాకపోతే, ఇక అసలు స్మార్ట్ ఫోన్లే లేని, టెక్నాలజీ తెలియని సామాన్య, పేద రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు.

​డబ్బా ఫోన్లు ఉన్నోళ్ల పరిస్థితి ఏంది?

​ఆన్‌లైన్ ద్వారానే యూరియా బుకింగ్ చేసుకోవాలనే నిబంధనలపై సర్పంచ్ మండిపడ్డారు. "మా పరిస్థితే ఇలా ఉంటే.. ఇక డబ్బా ఫోన్లు ఉన్నోళ్లు, రోజుకు ఒకటి రెండు బస్తాలు కావాలనుకునే చిన్న రైతుల పరిస్థితి ఏంది మేడం? వాళ్లు ఎట్లా తెచ్చుకోవాలి? ఒకరికి వస్తే.. ఇంకొకరికి రావడం లేదు. సీజన్ టైం దగ్గరకు వస్తోంది, పొలాల్లో చల్లుకోవడానికి యూరియా లేక రైతులు రోడ్ల మీద ఏడుస్తున్నారు" అని సర్పంచ్ మండిపడ్డారు.

బిచ్చగాళ్లకు ఇచ్చినట్టు ఇవ్వకండి : సర్పంచ్

పోచంపల్లి లాంటి పెద్ద ఊరికి కేవలం 400 బస్తాలు ఇస్తే ఎవరికి సరిపోతాయి? బిచ్చగాళ్లకు వేసినట్టు ఆ కొద్దిపాటి బస్తాలు వేయడం బంద్ చేయండి. వేస్తే ఒకేసారి 4,000 బస్తాలు దించి, అన్ని షాపుల్లో ఒకేసారి పంపిణీ చేయండి. లేదంటే పోచంపల్లికి యూరియా తేవడమే ఆపేయండి" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను పట్టించుకోకపోతే రైతులంతా కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామనిసర్పంచ్ చెప్పారు. ఈ ఆడియో ను విన్న రైతులు.. "సర్పంచ్‌కే ఇంత కష్టముంటే, మా లాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​ఇది ప్రభుత్వ పాలసీ.. నేనేం చేయలేను: ఏఓ

​సర్పంచ్ ప్రశ్నలకు మండల వ్యవసాయ అధికారి స్పందిస్తూ.. ఇది అందరికీ యూరియా దొరకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ అని, తాము కేవలం స్టాక్ మాత్రమే పెట్టగలమని, సర్వర్ సమస్యలపై తమకు ఎలాంటి నియంత్రణ ఉండదని తెలిపారు. అర్జెంట్ అయితే నానో యూరియా వాడుకోవాలని ఆమె సూచించారు.

Next Story