బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి

by Gantepaka Srikanth |   (  Updated:2026-07-09 08:25:40  IST  )

హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నివాస యోగ్యమైన నగరంగా (బెస్ట్ లివింగ్ సిటీ) తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నివాస యోగ్యమైన నగరంగా (బెస్ట్ లివింగ్ సిటీ) తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపూర్‌లో ‘ప్రీమియర్ ఎనర్జీస్’ సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన నెక్స్ట్-జెన్ సోలార్ మాడ్యూల్స్ తయారీ కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు తీసుకోబోతున్న కీలక నిర్ణయాలను వెల్లడించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2034 నాటికి 1 మిలియన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనను లక్ష్యంగా పెట్టుకున్నామని, అలాగే 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మారుస్తామని భరోసా ఇచ్చారు. దేశ సమగ్ర జీడీపీలో (GDP) ఏకంగా 10 శాతం వాటా ఒక్క తెలంగాణ నుంచే ఉండేలా తాము టార్గెట్ సెట్ చేసుకున్నట్లు సీఎం ప్రకటించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక విధానం (ఇండస్ట్రియల్ పాలసీ) దేశంలోనే అత్యుత్తమమైనదని ఆయన కొనియాడారు.

నగరంలో కాలుష్యానికి బ్రేక్..

కాలుష్య రహిత హైదరాబాద్ కోసం త్వరలోనే పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు (ORR) అవతలికి తరలించబోతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. "కోర్ అర్బన్ ఏరియాను డెవలప్ చేయడానికి ప్రత్యేక పాలసీని తీసుకొచ్చాం. పరిశ్రమలకు ఔటర్ రింగ్ రోడ్ అవతల భూములు కేటాయిస్తాం. ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజనల్ రింగ్ రోడ్ (RRR)ల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తాం. అలాగే రీజనల్ రింగ్ రోడ్ అవతల అగ్రి ఎకానమీని డెవలప్ చేస్తున్నాం" అని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నదిని కూడా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. దేశంలోని ఇతర మెట్రో నగరాల పరిస్థితులను ఉదాహరిస్తూ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కారణంగా స్కూళ్లకు, ఆఫీసులకు సెలవుల ఇవ్వాల్సిన దుస్థితి వచ్చిందని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల అక్కడ ఇలాంటి సమస్యలు వచ్చాయని గుర్తుచేశారు. బెంగళూరులో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య, చెన్నైలో నీటి కోరత వంటి అనేక ఇబ్బందులు ఉన్నాయని.. వాటన్నింటి నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్‌ను డెవలప్ చేస్తున్నామని చెప్పారు. ప్రకృతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే దేశంలోని కొన్ని నగరాల్లో ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ తయారు చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

యువత కోసం స్కిల్ యూనివర్సిటీ.. భూములిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు రాష్ట్రంలో కేవలం పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా, వాటిలో స్థానిక యువతకు ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యాభివృద్ధి (Skill Development) కోసం 'స్కిల్ యూనివర్సిటీ'ని నెలకోల్పుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాలేజీల నుంచి బయటకు వచ్చే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. సీతారాంపూర్లో పరిశ్రమల స్థాపనకు సహకరించిన స్థానిక ప్రజలకు ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీతారాంపురం ప్రజల త్యాగాల వల్లే ఇక్కడ ఈ రోజు ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పాటు అయింది. గతంలోనూ రంగారెడ్డి జిల్లా ప్రజలు చేసిన భూ త్యాగాల వల్లే ఔటర్ రింగ్ రోడ్, పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయి. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story