పరిశ్రమ తొలగించే వరకు పోరాటం ఆపేది లేదు...

by Taduka Kalyani |

రంగాయపల్లి గ్రామ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ, వందలాది మంది అనారోగ్యానికి, మరణాలకు కారణమవుతున్న ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను గ్రామం నుంచి తరలించే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తానని మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.

పరిశ్రమ తొలగించే వరకు పోరాటం ఆపేది లేదు...
X

దిశ, తూప్రాన్: రంగాయపల్లి గ్రామ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ, వందలాది మంది అనారోగ్యానికి, మరణాలకు కారణమవుతున్న ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను గ్రామం నుంచి తరలించే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తానని మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. పరిశ్రమ విస్తరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో వందలాది మంది పోలీసులను మోహరించి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేశారని ఆయన విమర్శించారు. "ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లితే కేసులు పెడతారు, కుటుంబాలు ఇబ్బందులు పడతాయి" అంటూ గ్రామస్తులను భయపెట్టి, పోలీసుల అండతో కొందరితో మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. గురువారం రంగాయపల్లి గ్రామంలో పర్యటించిన వంటేరు ప్రతాప్ రెడ్డి గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా చర్మ సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని, పరిశ్రమ నుంచి వచ్చే పొగ పంట పొలాలపై పడటంతో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు అండగా నిలబడి పరిశ్రమ విస్తరణను అడ్డుకునేందుకు అన్ని విధాలుగా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ పూల అర్జున్, నరాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story