- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్యారోగ్యశాఖ ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి గుడ్‌న్యూస్
ప్రతి నెల 1వ తేదీనే వేతనాల విడుదలపై వచ్చిన విజ్ఞప్తిపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాలలో విధులను నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీనే వేతనాలు విడుదల చేయాలన్న విజ్ఞప్తిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు.. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అందరికీ ప్రతినెలా ఒకటో తేదీ నాడే వేతనాలు అందేలా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
IHFMS పోర్టల్‌లో మార్పులకు ఆదేశం:
వివిధ ఏజెన్సీల ద్వారా వేతనాలు పొందుతున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆర్థిక ఇబ్బందులను, వారి ఆవేదనను మానవతా దృక్పథంతో అర్థం చేసుకున్నామని మంత్రి తెలిపారు. వారికి ప్రతి నెల 1వ తేదీన వేతనాలు విడుదల చేయడానికి వీలుగా.. IHFMS పోర్టల్ పాలసీలో అవసరమైన సవరణలు (మార్పులు) తీసుకురావాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వైద్య ఆరోగ్య శాఖలోని వేలాది మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.






