- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్ తో కలవను
తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలో చేరబోనని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలో చేరబోనని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కేటీఆర్, హరీశ్‌రావు తప్పుదోవ పట్టించి పార్టీని నాశనం చేశారని ఆరోపించారు. గురువారం కొత్తగూడెం సింగరేణి ప్రాంతంలో పర్యటించిన ఆమె కార్మికుల సమస్యలను తెలుసుకుని అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను మళ్లీ బీఆర్ఎస్‌లో చేరబోతున్నానంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని అన్నారు. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్లను తెలంగాణ అమరుల కుటుంబాలు, ఉద్యమకారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీతో తమకు భయం లేదని చెబుతూనే బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సంఘానికి వెయ్యికి పైగా ఫిర్యాదులు చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలితంగానే తాడిచర్ల బొగ్గు గనిని కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించిందని చెప్పారు. నిజాంపై రాసిచ్చిన మిగిలిన 16 బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికి కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నీటి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని విమర్శించిన కవిత, బీఆర్ఎస్‌పై రాజకీయ కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని నిలిపివేశారని ఆరోపించారు. అర కిలోమీటర్ మేర రాతి కట్ట నిర్మిస్తే నీటిని ఎత్తిపోసుకోవచ్చని సూచించారు. రైతులకు పంట బోనస్ ఇవ్వాలంటే బోగస్ మాటలు మాట్లాడుతున్నారని, మహబూబ్‌నగర్‌లో రైతులపై రౌడీషీట్లు తెరవించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదేనని ఎద్దేవా చేశారు. సీఎం సొంత జిల్లాలో రైతులపై నమోదు చేసిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారికి కనీస పనిముట్లు కూడా లేవని, భద్రత పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డులు నిర్వహించాలని, డిస్మిస్ అయిన కార్మికులకు మరో అవకాశం కల్పించాలని కోరారు. ఈ నెల 20లోపు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రామగుండం కేంద్రంగా నిరవధిక దీక్షలు చేపడతామని ప్రకటించారు.
అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీనిక్స్ సంస్థకు రూ.80 వేల కోట్ల విలువైన భూములను అక్రమంగా కేటాయించిందని, ఆ సంస్థ 33 లక్షల టన్నుల కలపను అక్రమంగా తరలిస్తున్నప్పటికీ అటవీ శాఖ నమోదు చేసిన కేసులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ఇచ్చిన భూములకు మించి కాంగ్రెస్ ప్రభుత్వం మరింత భూమిని కేటాయిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ కిటికీలు తెరిచి అవినీతి చేస్తే, కాంగ్రెస్ తలుపులు తెరిచి అవినీతి చేస్తోందని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కేటాయించిన అన్ని భూములపై సమీక్ష నిర్వహించి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రెండు పార్టీలకు ప్రజా అజెండా లేదని, దోపిడీయే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. హరీశ్‌రావును కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి ప్రధాన బాధ్యుడిగా పేర్కొంటూ, తన ఆరోపణలకు సమాధానం చెప్పే ధైర్యం లేక సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేయిస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందన్నారు. మేడిగడ్డతో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా కాళేశ్వరం రిజర్వాయర్లకు నీటిని తరలించవచ్చని వివరించారు.
సింగరేణి కార్మికుల సమస్యలను కూనంనేని విస్మరించారు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సింగరేణి కార్మికుల సమస్యలను పూర్తిగా విస్మరించారని కవిత ఆరోపించారు. కార్మికుల సమస్యలు, మెడికల్ బోర్డులు, సొంతింటి కల వంటి అంశాలపై ఆయన స్పందించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 25 కార్మిక చట్టాలను నాలుగుకు కుదించి కార్మికులకు అన్యాయం చేస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎర్రజెండా చేతబట్టి కాంగ్రెస్‌తో కలిసి తిరుగుతున్నారని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన కార్మిక చట్టాలను రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయనను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సింగరేణి హెచ్‌ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి రియాజ్ అహ్మద్, మాజీ మంత్రి బోడా జనార్ధన్, జిల్లా నాయకులు దేవుళ్ల వీరన్న, క్రాంతికుమార్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.






