మెదరబస్తీలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన ఇద్దరు యువకులు

by Taduka Kalyani |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా కొత్తగూడెం 3 టౌన్ పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

మెదరబస్తీలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన ఇద్దరు యువకులు
X

దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా కొత్తగూడెం 3 టౌన్ పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఈ ఘటన వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం పట్టణంలోని మెదరబస్తీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించగా, గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభించారు. ఈ ఘటనపై క్రైమ్ నెం. XXX/2026 కింద కేసు నమోదు చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. పోలీసులు యువకులకు గంజాయి వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని, గంజాయి కొనుగోలు, విక్రయం, రవాణా, నిల్వ, వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story